ఏపీలో గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ సరైన అంచానాలతోనే సీట్లు కేటాయించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని, ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జగన్ తన పార్టీ నేతలకు పిలుపునిచ్చారట. ఇందుకు సంబంధించిన కార్యాచరణను సైతం సిద్దం చేశారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో పోలింగ్ బూత్ స్థాయిలో గడపగడపకు వెళ్లాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారని సమాచారం. బూత్ కమిటీ సభ్యులతో కలిసి సమన్వయకర్తలు ప్రతి గడపకూ వెళ్లి, ప్రతి ఒక్కరినీ స్వయంగా కలుసుకుని కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలియచేయాలని జగన్ సూచించారట. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాలతో పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ దిశానిర్ధేశం చేశారని తెలుస్తోంది. రానున్న నాలుగైదు నెలలు చాలా కీలకమైనవని, వాటికి సన్నద్ధమయ్యేలా కార్యక్రమాలు రూపకల్పన చేశారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతోనే అనేక స్థానాల్లో స్వల్ప ఓట్లతో పరాజయం పాలైందనే విమర్శలున్నాయి. వీటిని సరిదిద్దుకునేందుకు ఇప్పటి నుంచే నేలు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. గతంలో పోల్‌మేనేజ్‌మెంట్‌లో ప్రత్యర్ధి పార్టీని అంచనావేయలేకపోవటంతో అపజయం మూటగట్టుకోవాల్సి వచ్చిందనే వాదనను పార్టీ వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ నేతల కుట్రలను పసిగట్టి వాటిని సమర్ధవంతంగా తిప్పగొట్టలేకపోవడంతో ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో వైసీపీ సానుభూతి పరుల ఓట్లు గల్లంతయ్యాయనే వాదన వినిపిస్తుంటుంది. పోలింగ్ బూత్‌కు వచ్చే వరకు ఈ విషయాన్ని వైసీపీ నేతలు గమనించలేకపోయారట. అటువంటి తప్పులు ఈసారి జరగకుండా జగన్ ఇప్పటినుంచే ఓటర్ల జాబితా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఓట్లు తొలగించే అవకాశం ఉంటే వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలని నేతలకు సూచించారని సమాచారం. గతంలో జగన్ పార్టీ నిర్వహించిన గడపగడపకు కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలతో వైసీపీ నేతలు నేరుగా కలిసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడిందట. అయితే పోల్‌మెనేజ్‌మెంట్‌లో వైఫల్యంతోనే అధికారానికి దూరమయ్యమనే భావన జగన్ పార్టీ నేతల్లో ఉంది. అందుకే ఈసారి వైసీపీ అధినేత జగన్ ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. మరి జగన్ కార్యాచరణ ప్రణాళిక ఎంతవరకూ ఫలితమిస్తుందో వేచిచూడాల్సిందే