బాబ్లీ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచుతోంది. మహారాష్ట్ర కోర్టు నుంచి చంద్రబాబుకు నోటీసులు, అరెస్ట్ వారెంట్ రావడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ముమ్మాటికీ ఇది బీజేపీ కక్ష్యసాధింపేనంటూ.. వారెంట్‌ను నిరసిస్తూ కార్యకర్తలు తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు, ఆందోళనలకు దిగారు. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోటీసుల వెనుక కుట్ర జరిగిందని.. వెంటనే వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని జిల్లాల్లో కూడా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కుట్రలో భాగంగా చంద్రబాబుపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారంటూ నేతలు నిరసన తెలిపారు. 2010నాటి కేసులో ఇప్పుడు నోటీసులు పంపడం దారుణమని.. అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చిరించారు. కరీంనగర్‌లో అయితే కలెక్టరేట్ ముందే టీడీపీ నేతలు బైఠాయించి ధర్నాకు దిగారు.
ఇటు ఏపీలోనూ పార్టీ నేతలు నిరసనలు తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో చేతులకు సంకెళ్లు వేసుకుని టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌లు పాల్గొన్నారు. కార్యకర్తలతో పాటూ వారు కూడా సంకెళ్ల వేసుకొన్నారు. కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని.. కక్షసాధింపులో భాగంగానే నోటీసులు పంపారని మండిపడ్డారు. గుంటూరులోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. ప్లకార్డులతో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ ఈ ఆందోళనలు కొనసాగాయి.