స్వచ్ఛధారతో ప్రాణాంతక వ్యాధులు దూరం అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద స్వచ్ఛధార వాహనాలను జెండా ఊపి గ్రామాలకు పంపించారు. అత్యాధునిక జర్మన్ టెక్నాలజీని వినియోగించి వాటర్ ట్యాంకులను పరిశుభ్రం చేసే లక్ష్యంతో స్వచ్ఛధార కార్యక్రమాన్ని పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టారని ముఖ్యమంత్రి తెలిపారు. తాగునీటి కాలుష్యం కారణంగానే 60 నుంచి 80 శాతం ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయని సీఎం వివరించారు. కేవలం వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండటం వల్లే తాగునీరు కాలుష్యం అవుతోందన్నారు.ఈ పరిస్థితి పై అధ్యయనం చేసిన మంత్రి లోకేష్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు స్వచ్ఛధార పథకాన్ని రూపొందించి ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖా మంత్రి నారా లోకేష్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ మురళీధర్‌రెడ్డి, పంచాయతీరాజ్ డైరెక్టర్ రంజిత్ భాషాలు పాల్గొన్నారు. స్వచ్ఛధార కార్యక్రమం ప్రత్యేకతలు... గ్రామీణప్రాంతాలలో వాటర్ హెడ్ ట్యాంకులు పరిశుభ్రంగా లేకపోవడంతో తాగునీరు కాలుష్యమై ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. కామెర్లు, కలరా, డైసెంటరీ, డయేరియా, గ్యాస్ట్రో ఎంటరైసిస్, థైరాయిడ్ వంటి వ్యాధులతో ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖా మంత్రి లోకేష్ ఆలోచించారు.అధికారులతో చర్చలు జరిపి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని నిర్ణయించారు. గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకులను జర్మన్ టెక్నాలజీతో ఆరు దశల్లో పరిశుభ్రం చేసే వాహనాలను కొనుగోలు చేశారు. ఆరునెలలకోసారి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలోని అన్ని వాటర్ ట్యాంకులనూ క్లీన్ చేసే విధంగా రూపొందించిన ఈ పథకమే పేరే ``స్వచ్ఛధార``. జర్మనీ టెక్నాలజీ వినియోగించుకుంటూ వాటర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.