YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతపురంలో నిమజ్జన గండం

 అనంతపురంలో నిమజ్జన గండం

గణనాథుడికి ఈ ఏడాదీ నిమజ్జన గండం తప్పడం లేదు. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో వర్షపాతం భారీగా పడిపోయింది. ఫలితంగా జిల్లాలో వందలాది చెరువుల్లో నీరు లేకపోవడం, కుంటలు, వంకలు, వాగుల్లో పారకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించిన భక్తులు ఎక్కడ నిమజ్జనం చేయాలన్న సందిగ్ధంలో ఉన్నారు. ఇక జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో గణేషుడి విగ్రహాలను ఏర్పాటుచేసి, భక్తిశ్రద్ధలతో పూజలు చేసి శోభాయమానంగా, వైభవంగా పండుగ జరుపుకునే అనంతపురం నగర వాసులు సైతం నిమజ్జనంపై ఆందోళనగా ఉన్నారు. నగరంలోని వేలాది విగ్రహాలను హెచ్చెల్సీ కాలువతోపాటు శింగనమల చెరువులో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. మూడు రోజుల పూజలందుకున్న చిన్న, మధ్యతరహా విగ్రహాలను హెచ్చెల్సీ కాలువలో నిమజ్జనం చేసే వారు. అయితే ఈ కాలువకు ఇప్పట్లో నీరు విడుదలయ్యే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఒట్టి కాలువలోనే వినాయకుల్ని నిమజ్జనం చేసే పరిస్థితులున్నాయి. ఇక శింగనమల చెరువుకు తరలిద్దామంటే నీరు అడుగంటి పోయింది. అక్కడ నిల్వ ఉంచిన గత ఏడాది నీరు 0.3 టీఎంసీ (300 ఎంసీఎఫ్‌టీ) మాత్రమే ఉన్నట్లు అధికారిక సమాచారం. ఈ పరిస్థితుల్లో నగరంతోపాటు బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల పరిధిలోని గ్రామాల్లో కొలువుదీరిన గణనాథుల్ని నిమజ్జం ప్రశ్నార్థకమైంది. తుంగభద్ర జలాశయం నుంచి విడుదలవుతున్న నీటిని పీఏబీఆర్‌లో తాగునీటి అవసరాల నిమిత్తం నిల్వ ఉంచుతున్నారు. అంతేకాకుండా హెచ్చెల్సీ 43, 44 ప్యాకేజీల్లో కాలువ స్ట్రక్చర్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 15 నాటికి ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుంచి హెచ్చెల్సీ కాలువకు నీటిని విడుదల చేస్తారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో గత నాలుగైదు రోజులుగా మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, ఎస్పీ, జలవనరుల శాఖ అధికారులు వినాయక నిమజ్జనానికి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పరిశీలన చేపట్టారు. ముఖ్యంగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే హంద్రీనీవా నీటిలో రాప్తాడు మండలం బొమ్మేపర్తి వద్ద చెక్‌డ్యామ్‌కు తరలించి అక్కడి నుంచి పండమేరుకు వచ్చేలా చేసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు

Related Posts