YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చీలిక ఓట్లపై నే కమలం దృష్టి

చీలిక ఓట్లపై నే కమలం దృష్టి

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కమలం పార్టీది అదే పాలసీ. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కొత్త పార్టీని పెట్టించడం, ఆ పార్టీలో చీలిక తేవడం వంటివి కమలనాధులు కొత్త ఎత్తుగడలు. తమ ఓటు బ్యాంకు యధాతథంగా ఉండటం, వైరిపక్షం వారి ఓట్లలో చీలిక తేవడం ద్వారా అధిక సీట్లను చేజిక్కించుకోవడం, అధికారాన్ని పొందడం లోటస్ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. అయితే ఈ కొత్త ఎత్తుగడతో ఎంతో కొంత లబ్ది ఉంటుందన్నది కమలనాధుల విశ్వాసం. కమలనాధుల ఎత్తుగడతో ప్రాంతీయ పార్టీలు కకావికలం అవుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. బీజేపీ సుదీర్ఘకాలం మనుగడ దేశవ్యాప్తంగా సాగించాలంటే ఈ ఎత్తులు అమలు చేయాలన్నది ఆ పార్టీ ఆలోచన.ఉత్తరప్రదేశ్ నే తీసుకుంటే అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేస్తే బీజేపీకి చుక్కలు కనపడటం ఖాయం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనే ఆ కూటమి ఘన విజయం సాధించడంతో వాళ్లు కలసి ఉంటే తమకు కష్టాలు తప్పవని భావించిన కమలం పార్టీ అక్కడ ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ చేత కొత్త పార్టీని పెట్టిస్తుందన్న వార్తలు వచ్చాయి. శివపాల్ యాదవ్ తో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యానాధ్ నిత్యం టచ్ లోనే ఉంటున్నారని, నిజానికి శివపాల్ యాదవ్ బీజేపీలో చేరేందుకు ముందుకు వచ్చినా వద్దని వారించి కమలనాధులే కొత్త పార్టీ ప్రకటన చేయించారన్న ప్రచారమూ ఉంది. దీనివల్ల లోక్ సభ ఎన్నికల్లో తమ గెలుపు ఇబ్బంది ఉండదన్న కారణమేనని తెలుస్తోంది.

ఒడిశాలో కూడా ఇదే ప్లాన్ ను బీజేపీ అమలు చేయబోతోంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నాలుగు దఫాలుగా విజయకేతనం ఎగురవేశారు. ఒడిశాలో బిజూ జనతాదళ్ కు ఎదురే లేదు. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు కొంత బలం తగ్గింది. కమలం పార్టీ బలం పెరిగింది. స్థానికసంస్థల ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలవడం, అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో బీజేపీ అగ్రనేతల కన్ను ఒడిశాపై పడింది. లోక్ సభ ఎన్నికలతో పాటే ఒడిశా రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ అధికార పార్టీ బిజూ జనతాదళ్ లో చీలిక తేవడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై ఆ పార్టీ సీనియర్ నేతలు బిజోయ్ మహాపాత్రో, దిలీప్ రాయ్ లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారు కమలం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా ఆ పార్టీ వారిని వారించింది. అలాగే మాజీ మంత్రి ప్రపుల్లా ఘడాయ్, దామోదర్ రౌత్, బై జయంత్ జే పాండాలు కూడా అదే బాటలో ఉన్నారు. నవీన్ పై అసంతృప్త నేతలందరినీ ఒక తాటిపైకి చేర్చి వారితో కొత్త పార్టీని పెట్టించాలన్నది కమలం పార్టీ వ్యూహంగా ఉంది. అయితే ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుందో తెలియదు కాని, నవీన్ కు మాత్రం త్వరలోనే పార్టీలో ముసలం ప్రారంభమవుతందన్నది మాత్రం వాస్తవం. మరి నవీన్ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Related Posts