ఆసియాకప్‌ను పాకిస్థాన్ విజయంతో మొదలుపెట్టింది. హాంకాంగ్‌ను ఓడించిన పాక్ పాయింట్ల ఖాతా తెరిచింది. ఆదివారం జరిగిన గ్రూప్-ఎ తొలి మ్యాచ్‌లో సర్ఫ్‌రాజ్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో పసికూన హాంకాంగ్‌ను ఓడించింది. ఓపెనర్లు ఫకర్ జమాన్ (27 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 24), ఇమాముల్ హక్ (69 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 50 నాటౌట్)లతోపాటు బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 33) సత్తా చాటడంతో 117 పరుగుల సునాయాస లక్ష్యాన్ని పాక్ 23.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్.. పాక్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. ముఖ్యంగా పేసర్లు ఉస్మాన్‌ఖాన్, హాసన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేసి హాంకాంగ్ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆరంభంలో 17/0తో ఉన్న హాంకాంగ్.. పాక్ పేసర్ల దెబ్బకు 37.1 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది.