YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇక వైజాగ్ ఎయిర్ పోర్ట్ 24 బై 7

ఇక వైజాగ్ ఎయిర్ పోర్ట్ 24 బై 7

 విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంక్షల బెడద తొలగిపోయింది. ఈ ఎయిర్‌పోర్టు ఇక 24 గంటలూ పౌర విమాన సర్వీసులు నడపడానికి రక్షణ మంత్రిత్వశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రక్షణశాఖ అధీనంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్టులోకి పౌర విమానాల రాకపోకలపై కొన్నాళ్ల క్రితం నేవీ ఆంక్షలు విధించింది.విశాఖ విమానాశ్రయం పౌర విమానాల వేళలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు గతంలో నేవీ ప్రకటనతో ఈ ఎయిర్‌పోర్టుకు కొత్తగా ఒక అంతర్జాతీయ (థాయ్‌లాండ్‌కు), 8 డొమెస్టిక్‌ విమాన సర్వీసులు నడపడానికి ముందుకొచ్చాయి. వీటి షెడ్యూళ్లు వచ్చే నెలలో వెలువడనున్నాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి రోజూ 70 పౌర విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ విమానాశ్రయం నుంచి విమానాలు దేశ, విదేశాలకు రాకపోకలు జరుగుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు రక్షణ మంత్రి సాక్షాత్తూ ప్రకటించడంతో విమానయాన సంస్థల్లో నమ్మకాన్ని పెంచినట్టు అయిందని ఏపీఏటీఏ ఉపాధ్యక్షుడు డీఎస్‌ వర్మ, విశాఖ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఓ.నరేష్‌కుమార్‌లు ‘సాక్షి’తో చెప్పారు. ఈ విమానాశ్రయానికి మరిన్ని కొత్త సర్వీసుల రాకతో దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. నేవీ యుద్ధ విమానాల రాకపోకలు, విన్యాసాలు, సిబ్బందికి శిక్షణ వంటి మిలట్రీ ఆపరేషన్ల కోసం నవంబర్‌ ఒకటో తేదీ నుంచి రోజూ ఉదయం 9.30 నుంచి 12.30, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఐదు గంటల పాటు పౌర విమానాలపై నిషేధం విధించింది. మంగళ, గురువారాల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కూడా పౌర విమానాలు రాకపోకలు సాగించరాదని ఆంక్షలు పెట్టింది. దీంతో ఈ ఆంక్షల వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని కొన్ని పౌర విమానయాన సంస్థలు విశాఖకు తమ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్టు, మరికొన్ని సంస్థలు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాయి. రక్షణ శాఖ ఆంక్షల నిర్ణయంపై ప్రయాణికుల నుంచే కాక వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, ఐటీ వర్గాలు, ఏపీ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌(ఏపీఏటీఏ) నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అంతేకాదు.. ఆంక్షలను సడలించకపోతే ఆందోళనకు సైతం సమాయత్తమయ్యారు. పరిస్థితిని గమనించిన రక్షణశాఖ అధికారులు తొలుత ఐదు గంటల నిషేధాన్ని మూడు గంటలకు కుదిస్తామని దిగివచ్చినా అంగీకరించలేదు.

Related Posts