అవును! రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడం కష్టం. అలాంటిదే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజోలులోనూ చోటు చేసుకుంటోంది. ఎస్సీ వర్గానికి కేటాయించిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే ముమ్మడివరంలో పితాని బాలకృష్ణకు సీటు ఇవ్వడంతో అక్కడ పోటీని టఫ్‌గా మార్చేసిన పవన్ రాజోలులోనూ రాపాకను రంగంలోకి దింపి ఇక్కడ కూడా ప్రధాన పార్టీలకు చెమటలు పట్టించే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టే కనపడుతోంది.ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి.. గొల్లపల్లి సూర్యారావు విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కూడా అయ్యారు. ఇక, అప్పటి ఎన్నికల్లో వైసీపీ తరఫున బొంతు రాజేశ్వరరావు పోటీ చేశారు. అయితే, అప్పటి ఎన్నికల్లో.. రాజేశ్వరరావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి కూడా ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అధికార పార్టీ వివక్షను ఆయన ఎండగడుతూనే ఉన్నారు. దీంతో ప్రజల్లో దూసుకుపోతున్నారని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజేశ్వరరావు మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. ఇక గొల్లపల్లి సూర్యారావుకు మళ్లీ ఇక్కడే సీటు ఇస్తారా ? లేదా ఆయన్ను మరో నియోజకవర్గానికి మారుస్తారా ? అన్న చర్చ టీడీపీలో ఉంది. ఈ రెండు పార్టీల సంగతి ఇలా ఉంటే తాజాగా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశా రు. ఆయన మర్యాద పూర్వకంగా కలిసినప్పటికీ రాజోలు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని దాదాపుగా ఆయన అభ్యర్థిత్వం ఖాయమైనట్టు జనసేన అభిమానులు అంటున్నారు.ఈ పరిణామాలతో తూర్పు గోదావరి జిల్లా రాజోలులో రాజకీయాలు కీలకంగా మారాయని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని చెబుతున్నారు. ఇక్కడ రెండు ప్రధాన పార్టీలతో పాటు జనసేన కూడా బలంగానే ఉంది. నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపు వర్గం ఓటర్లతో పాటు ఎస్సీలు, బీసీల్లో కొన్ని వర్గాల్లో మెజార్టీ ఓటర్లు జనసేనకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు అందుతున్న అంచనాల ప్రకారం జనసేన తరఫున రాపాక బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతమున్న పరిస్థితులే ఉంటాయా? లేక మారతాయా? అన్నది కూడా చర్చకు వస్తోంది. బలమైన అభ్యర్థిగా రాపాక బరిలో నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. గత 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై తన హవా చూపించారని, వచ్చే ఎన్నికల్లోనూ బలమైన పక్షంగా ఆయన కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.