జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కానీ జిల్లా అధికారులు మాత్రం అదేం లేదంటూ దాచిపెడుతున్నారు. జ్వరాల తీవ్రత ఏమీ లేదంటూ బుకాయిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు అన్ని ప్రాంతాల్లో ప్రబలుతున్నాయి. అక్కడక్కడ మరణాలు కూడా సంభవిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల బారిన పడిన బాధితులు, మృతుల సంఖ్యను పక్కాగా నమోదు చేయడం లేదు. బోగస్ గణాంకాలతో ఏకంగా ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. జిల్లా యంత్రాంగం వైఖరితో జ్వరాలు తగ్గడం కథ అటుంచితే... చాపకింద నీరులా పాకుతున్నాయి. యల్లనూరు మండలంలో రెండు డెంగీ కేసులు నమోదైనా చూపించలేదు. అక్కడి నుంచి నేరుగా సీఎం ప్రజా ఫిర్యాదుల విభాగానికి సమాచారం వెళ్లింది. నేరుగా సీఎం ఆరా తీయడం విశేషం.
కాష్ట్రంలో విశాఖ, విజయనగరం, గోదావరి జిల్లాల తర్వాత అనంతపురం జిల్లాలోనే జ్వరాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇంత జరుగుతున్నా ఆయా శాఖల సిబ్బందిలో కనీస చలనం రాలేదు. చాలా గ్రామాల్లో జ్వరాలు సోకినా నమోదు కావడం లేదు. గత మూడేళ్ల జ్వరాల గణాంకాలను పరిగణనలోకి తీసుకొన్నా అధికార యంత్రాంగం బోగస్ వ్యవహారం తేటతెల్లమవుతోంది. ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో అసలు జిల్లాలో డెంగీ, మలేరియా ప్రభావం లేదంటూ నివేదికలు పంపడం విశేషం. జిల్లాలో అనంత వైద్య కళాశాల, హిందూపురం ఆస్పత్రుల్లో ఎలీషా ల్యాబ్‌లు ఉన్నాయి. ఇక్కడి గణాంకాలను చూసినా అధికారుల వైఖరి స్పష్టంగా బయట పడుతుంది. ఈ రెండు ల్యాబ్‌ల నుంచి ప్రతి రోజూ డీఎంహెచ్‌వో కార్యాలయానికి వివరాలు వెళ్తాయి. అక్కడి నుంచి వచ్చిన వాటిని యథావిధిగా ప్రభుత్వానికి పంపడం లేదనేది నిష్ఠూర సత్యం.
క్షేత్ర స్థాయిలో జ్వర బాధితుల నుంచి రక్త నమూనాలు తీసి వ్యాధి నిర్ధరణకు పంపాలి. ఈ విషయంలో మెడాల్ సంస్థ కూడా బోగస్ లెక్కలను నమోదు చేస్తోంది. డెంగీ పరీక్షలు చేస్తున్నామంటూ రూ.లక్షలు బిల్లులు చేస్తోంది. పనిలో పనిగా నమూనాలు తీయడంలోనూ చేతివాటం చూపిస్తోంది. ఆరోగ్యశాఖకు చెందిన క్షేత్ర స్థాయి సిబ్బందికి నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి శుక్రవారం గర్భిణుల నుంచి రక్తం తీసి... ఈ నమూనాల సంఖ్యను పెంచి.. బోగస్ పేర్లు నమోదు చేస్తున్నారు. సంఖ్య మాత్రమే చెబుతున్నారే తప్ప... నమూనాలు, వాటికి చెందిన నివేదికలు ఏమీ ఉండవు.
మలేరియా పీఎఫ్ అనే జ్వరం వస్తే నిర్దేశిత రోగి పరిసరాల్లోని కనీసం 50 ఇళ్లల్లోని వ్యక్తుల నుంచి నమూనాలు తీయాలి. దీన్నే రాపిడ్ విధానం అంటారు. ఇది అసలు అమలు కాలేదు. జిల్లాలోని ప్రైవేట్ నర్శింగ్ హోమ్, డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో చేసే వ్యాధి నిర్ధరణ వివరాలేవీ ఆరోగ్య శాఖకు అందడం లేదు. వీటిని అసలు పరిగణనలోకే తీసుకోవడం లేదు. తూతూమంత్రంగా లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని నిండా మోసం చేస్తున్నారు.