ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రెండు సరికొత్త టారిఫ్‌లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. అనంత్, అనంత్ ప్లస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్ల ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందించనుంది. రూ.105తో అనంత్ ప్లాన్, రూ.328తో అనంత్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో మాత్రమే ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాన్లలో ఒకే రకమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ప్లాన్ల కాలపరిమితిలో మాత్రం తేడా ఉంది. అనంత్ ప్లాన్ కాలపరిమితి 26 రోజులు కాగా, అనంత్ ప్లస్ ప్లాన్ కాలపరిమితి 90 రోజులుగా ఉంది. ఇవే ప్లాన్లను ఢిల్లీ, ముంబయి ప్రాంతాల్లో రూ.99, రూ.319లకు అందిస్తోంది. అయితే సర్కిళ్ల వారీగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్రయోజనాలు మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కింద.. వినియోగదారులు లోకల్ కాల్స్‌తోపాటు.. రోమింగ్ కాల్స్‌ను కూడా పొందుతారు. కొన్నిరోజుల క్రితం వినియోగదారులకు డేటా ప్రయోజనాల కోసం 'డేటా సునామీ' ప్రీపెయిడ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిద్వారా వినియోగదారులకు రూ.98కే రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ కాలపరిమితి 26 రోజులు. అంటే నెలకు 39 జీబీ డేటా వినియోగదారులు పొందుతున్నారు. జియోలో ఇదే రూ.98 ప్లాన్ కింద 28 రోజుల కాలపరిమితితో 2 జీబీ డేటా మాత్రమే ఇస్తున్నారు.