కృష్ణా జిల్లా వైకాపాలో అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో కాపు నేతలకు అన్యాయం జరుగుతోందంటూ ఉయ్యూరు కౌన్సిలర్, జిల్లా పార్టీ ఫ్లోర్ లీడర్ వంగవీటి శ్రీనివాస ప్రసాద్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణకు సోదరుడైన శ్రీనివాస ప్రసాద్ రాజీనామా వ్యవహారం పార్టీలో చర్చనీయాంశమైంది.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి నుంచి పోటీపై జగన్ తనకు హామీ ఇవ్వకపోవడంతో కొంతకాలంగా వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తిగా ఉన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో విజయవాడ సెంట్రల్ టిక్కెట్ తనకు కేటాయించాలని రాధాకృష్ణ కోరగా పార్టీ ముఖ్య నేతలు సహా జగన్ నుంచి హామీ రాలేదని తెలిసింది. దీంతో పార్టీ సమావేశం నుంచి రాధాకృష్ణ తన అనుచరులతో కలిసి అర్థాంతరంగా వెళ్లిపోయారు. భవిష్యత్ కార్యాచరణపై వంగవీటి కుటుంబ సభ్యులు, అనుచరులతో రాధాకృష్ణ నిన్న రాత్రి పొద్దుపోయేవరకు మంతనాలు జరిపారు. రాధాకృష్ణ సోదరుడు ఇవాళ వైకాపాకు రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. అసంతృప్తితో ఉన్న వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణ సహా ఆయన అనుచరులను బుజ్జగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు.