బెజవాడలో ప్రజారోగ్యం పడకేసింది. విష జ్వరాలు విజృంభించడంతో ప్రజలు విలవిలాడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ కేసులు రోజుకి పెరిగిపోతున్నాయి. మురికివాడల్లోని పలు ప్రాంతాల్లో అనుమానిత కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. సింగ్ నగర్, పాయకాపురం, ప్రకాశ్ నగర్, సుందరయ్య నగర్, నాలా పరిసరాలు, బుడమేరు కట్ట ప్రాంతాల్లో ప్రజలను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ బారిన పడి జనం మంచం పట్టారు.విష జ్వరాలు సోకినవారిలో ప్లేట్ లెట్ కౌంట్ పడిపోతున్నాయి. దీంతో రోగులు స్ధానిక ప్రభుత్వాసుత్రులకు వెళ్లినప్పటికీ అక్కడ సరైన వసతులు లేకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీంతో డబ్బులు లేని పేద ప్రజలు అప్పులపాలవుతున్నారు. తమ బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారని రోగులు ఆవేదన చెందుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం, కలుషితమైన నీరు సేవించడం వల్లే జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పరిసరాల శుభ్రతతో పాటు నీరు నిల్వవుండకుండా చర్యలు తీసుకుంటే దోమల సంతతిని నిరోధించవచ్చంటున్నారు.