పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంతో పాటు ఇరువైపులా ఉన్న రోడ్లు, పరిసర ప్రాంతాలన్నీ ఇక నిఘానేత్రం పరిధిలోకి వచ్చేశాయి. ఈ ప్రాంతంలో ప్రతి కదలికను సీసీ కెమేరాలు గుర్తిస్తాయి. ప్రాజెక్టు ప్రాంతంలో రూ.వేలాది కోట్ల విలువైన యంత్రాలు ఉండటం, నక్సల్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు శాఖ పోలవరం ప్రాజెక్టు భద్రతపై దష్టి సారించింది. పరిసర ప్రాంతాల్లో ప్రాజెక్టుకు ఇరు వైపులా రెండు చెక్ పోస్టులు, 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. పోలవరం వైపు నుంచి ప్రాజెక్టు వద్దకు వెళ్లే వాహనాలు, వ్యక్తుల వివరాలను పాత పోతవరం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద నమోదు చేస్తారు. అలాగే ఎగువ ఏజెన్సీ గ్రామాల నుంచి వచ్చే వారి వివరాలను పాత చేగొండపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద నమోదు చేస్తారు. రెండు చెక్‌పోస్టుల వద్ద, రోడ్డు మార్గంలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టూరిజం బోట్ పాయింట్ వద్ద, ట్విన్ టన్నెల్స్, ఒటి రెగ్యులేటర్, ప్రాజెక్టు కొండపైన, ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయం వద్ద, త్రివేణి, ఎల్‌అండ్‌టీ సంస్థల వద్ద, ఎంట్రీ పాయింట్ల వద్ద కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు 40 మంది ప్రత్యేక పోలీసులు ప్రాజెక్టు కొండపై గస్తీ నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా తాజాగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, వాహనాలు వస్తే వాటి వివరాలను నమోదు చేస్తారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విలువైన యంత్రాలు ఉన్నాయి. వీటి భద్రత కోసం రెండు చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని... రోడ్డు మార్గంలో గోదావరి తీరం వెంబడి సంచరించే వాహనాలు, వ్యక్తుల వివరాలను నమోదు చేయనున్నిరు. ప్రధానంగా కొత్త వ్యక్తుల సంచారంపై దష్టి పెడతామంటున్నారు అధికారులు