భవిష్యత్తులో టెక్నాలజీ అనేది ఒక ప్రెండ్ గా ఉపయోగపడే పరిస్థితి వస్తోంది. టెక్నాలజీ వలన చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఖర్చు, రిస్క్ తగ్గుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అయన అసెంబ్లీలో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రభుత్వంలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. శాస్త్రీయత లేకుండానే రాష్ట్రాన్ని విభజించారు. తొలి ఏడాది రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు. రాష్ట్ర విభజన తర్వాత మనం కట్టుబట్టలతో వచ్చి ప్రయాణం సాగించాం. కానీ అధైర్య పడలేదని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే స్థితిలో లేము..కాబట్టి నవ నిర్మాణ దీక్షలు పెట్టి ప్రజల్లో పట్టుదల తీసుకొచ్చాం. 1995లో విజన్ 2020 తయారు చేశాం. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితులను ఆలోచించుకుని విజన్ 2022, 2029, 2050 తయారు చేశాం. 2022కి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. 2029కి దేశంలో నెంబర్ ఒన్ రాష్ట్రంగా ఉండాలి. 2050కి ప్రపంచంలోని అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రతి సంవత్సరం రెండు అంకెల అభివృద్ధి జరగాలని అన్నారు. ఏడు ప్రైమరీ మిషన్స్ పెట్టుకున్నాం. ఫోకస్ కోసం ఐదు గ్రిడ్స్ పెట్టుకున్నాం. ఐదు క్యాంపైన్ మోడ్స్ తీసుకున్నాం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేవరకు ఏమేమి చేయాలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. ప్రతిఒక్కరికి చేయూతను ఇవ్వాలనుకుంటున్నాం. పేద పిల్లల కలల్ని నిజం చేయాలనే ఉద్దేశంతో కొన్ని వేల మందిని విదేశీ విద్య కింద బెస్ట్ యూనివర్సిటీలకు పంపుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు.