తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తొలుత పెదపాడులో దివంగత సీఎం దామోదరం సంజీవయ్య చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కర్నూలులో బైరెడ్డి ఫంక్షన్ హాల్ లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని చెప్పారు. ఏపీకి కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందాలని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై సూటిగా సమాధానం చెప్పారు. హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని ఇప్పటి ప్రధాని మోదీ పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలో స్వయం సహాయక సంఘాల పనితీరును ప్రశంసించారు. దేశంలోనే మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. చైనాలో రోజుకు 50వేల ఉద్యోగాలు కల్పిస్తుంటే.. మన దేశంలో 450 మాత్రమే కల్పిస్తున్నారని మండిపడ్డారు.