వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజాసంకల్పయాత్ర’ మూడు వేల కిలోమీటర్లకు చేరువైంది. ప్రస్తుతం విశాఖ పట్టణం జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతూ ఉంది. ఇప్పటి వరకూ జగన్ పాదయాత్ర దాదాపు 2,970 కిలోమీటర్ల దూరం సాగింది. మరో రెండు రోజుల్లో జగన్ మూడు వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటేసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రలో జగన్ పాదయాత్ర ఆసక్తిదాయకంగా నిలుస్తోంది. ప్రత్యేకించి ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా? అనే ప్రశ్న నేపథ్యంలో ఇక్కడ పాదయాత్రకు వస్తున్న స్పందన చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్రలో సత్తా చూపలేకపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్ పాదయాత్రలో భారీ జనసందోహం కనిపిస్తూ ఉండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ ప్రాంతంలో జగన్ పాదయాత్రను వర్షం కూడా పలకరిస్తోంది. ఆ జల్లుల మధ్యన కూడా జగన్ నడకను సాగిస్తూ ఉండటం విశేషం. ఇక పాదయాత్ర ప్రసంగాల్లో వైఎస్సార్సీపీ అధినేత తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తుతూ, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, స్థానిక నేతల తీరుపైనా విమర్శనాస్త్రాలు సంధిస్తూ సాగుతున్నారు. అబద్ధాలు, కట్టుకథలతో పునాది గోడలను కూడా దాటని పోలవరం ప్రాజెక్టును చూపించి ప్రజలందరినీ పిచ్చివాళ్లను చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ జగన్ తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. వెయ్యి రూపాయల ఖర్చు దాటే వైద్యానికంతా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తామని సామాన్య ప్రజలకు జగన్ ప్రత్యేక హామీ ఇస్తున్నారు.