విజయవాడ సెంట్రల్ టికెట్ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. టికెట్‌పై వంగవీటి రాధా వెనక్కి తగ్గలేదు. అయితే సెంట్రల్ బాధ్యతలు మల్లాది విష్ణుకే అని వైసీపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగానే తెలుస్తోంది. ఇంత వరకూ రాధాతో జిల్లా కీలక నేతలు ఎవ్వరూ టచ్‌లోకి రాలేదు. వైసీపీ నేతల తీరుతో రాధా తీవ్ర మనస్తాపం చెందారు. మంగళవారం మధ్యాహ్నం రంగా, రాధా మిత్రమండలితో కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరూ తొందరపడొద్దని.. చర్చించి నిర్ణయం తీసుకుందామని కార్యకర్తలు, అభిమానులకు ఈ సందర్భంగా రాధా పిలుపునిచ్చారు.ఐతే.. మూడు రోజులు ఓపిక పెట్టాలని వారికి రాధా సూచించారు. 'మనం ఇంకా పార్టీలోనే ఉన్నాం..అధిష్టానంతో మాట్లాడదాం' అని చెప్పారు. అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని రాధా తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రాధా అనుచరులు మాట్లాడుతూ.. జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకు అన్యాయం చేస్తే జగన్‌కు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నారు. జగన్ డబ్బుకు అమ్ముడు పోయి రాధాకు ద్రోహం చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.రెండురోజులుగా ఆందోళనలు జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శలు గుప్పిస్తున్నారు. రాధాకు సీటివ్వకపోతే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాధా అనుచరులు చెబుతున్నారు. అయితే అధిష్ఠానం మాత్రం ఇంత వరకూ స్పందించిన దాఖలాల్లేవ్. ఇదిలా ఉంటే.. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మేం రాధా వెంటే ఉంటామని.. రాధా ఏ పార్టీలో ఉంటే మేం అదే పార్టీలో ఉంటామని రంగా అభిమానులు స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ సభ్యత్వ ప్రతులను రాధా - రంగా అభిమానులు తగలబెట్టారు.