రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, ఈవో అనిల్కుమార్ సింఘాల్, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు సుధానారాయణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.