గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు అక్టోబర్ నుంచి నుంచి ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత విమానయాన సంస్థ చొరవతో ఇండిగో ముందుకొచ్చి సింగపూర్‌కు సర్వీసు నడపబోతోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాల నుంచి ఏటా ఈ నాలుగు జిల్లాల నుంచి 25 లక్షల మంది హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్నారు. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వస్తే.. వీరందరూ ఇక్కడి నుంచే వెళ్లేందుకు వీలుంటుంది. సింగపూర్‌తో భారతదేశానికి బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సముద్ర మార్గంలో నౌకల ద్వారా జరిగే రవాణా చాలావరకు సింగపూర్, దుబాయ్ మీదుగానే ఇతర దేశాలకు చేరుకుంటాయి.సింగపూర్‌కు ఏటా కోస్తా ప్రాంతం నుంచి వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. . రోజూ హైదరాబాద్ నుంచి సింగపూర్, దుబాయ్‌లకు ఆరు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి రోజూ ఒక్క విమాన సర్వీసును సింగపూర్, దుబాయ్‌కు నడిపితే.. వెసులుబాటు కలుగుతుందని ఎప్పటినుంచో ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. ప్రయాణ ఖర్చు, సమయం ఆదా..: సింగపూర్‌కు విమాన టిక్కెట్ రూ. 16 నుంచి రూ. 20 వేల వరకూ అవుతోంది. అదే.. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానంలో, రోడ్డు మార్గంలో వెళ్లడం వల్ల ఖర్చు అదనం. అక్కడ వేచి ఉండే సమయంలో ఖర్చు, విమానాశ్రయంలో యూజర్ డెవలప్‌మెంట్ ఛార్జీలు సైతం ప్రయాణికులపై పడుతున్నాయి. అమెరికా, లండన్, కెనడా ఎక్కడి నుంచి వచ్చేవారినైనా తీసుకొచ్చేందుకు, సాగనంపేందుకు ఇక్కడి నుంచి వారి బంధువులు నిత్యం హైదరాబాద్‌కు వాహనాల్లో వెళ్లి వస్తున్నారు.ఇది మళ్లీ అదనపు ఖర్చు.. ప్రయాస. హైదరాబాద్‌కు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లాక.. అక్కడ తెల్లవారుజామున 2గంటల తర్వాత నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు ఉంటాయి. దీంతో ఇక్కడి నుంచి రాత్రి 10 గంటలకు అక్కడికి చేరుకున్నా.. కనీసం ఐదారు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. అటునుంచి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే ప్రయాణికులు.. తెల్లవారే వరకూ విమానాశ్రయంలోనే ఉండాల్సి వస్తోంది. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఐదారు గంటలు ప్రయాణించి విజయవాడకు చేరాలి. ప్రస్తుతం ప్రవాసాంధ్రులు, విదేశాలకు వెళ్లే యాత్రికుల కోసమే ప్రత్యేకంగా వందల వాహనాలు నడుస్తున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా ఓ ఏసీ సర్వీసు విదేశాల నుంచి వచ్చే వారి కోసం నడుపుతున్నారు.