తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఏమైనా విభేదాలుంటే నాలుగు గోడల మధ్యే మాట్లాడుకోవాలని టీడీపీ అధిష్ఠానం తీవ్రస్థాయిలో హెచ్చరించినా ఫలితం లేకపోయింది. మేయర్ కోనేరు శ్రీ్ధర్‌కు, పార్టీ సీనియర్ కార్పొరేటర్లకు మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయనడానికి కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశం నిదర్శంగా నిలిచింది. వివిధ అంశాలు, నగర ప్రధాన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి తన అధ్యక్షతన జరిపిన సమావేశంలో మేయర్‌కు భంగపాటు ఎదురైంది. నగరంలో ఫన్‌టైమ్స్ క్లబ్ వీఎంసీ స్థలంలో ఏర్పాటు చేయడమే కాకుండా బైలా ప్రకారం వీఎంసీ కమిషనర్ చైర్మన్‌గా ఉంటున్నప్పటికీ సభ్యత నమోదు ఆదాయం, డిపాజిట్లు, ఇతర ఆదాయ వనరుల విషయంలో సమాచారం ఇవ్వటం లేదని మేయర్ తన ప్రసంగంలో విమర్శించారు. ఇష్టానుసారం వ్యవహరించడమే కాకుండా వీఎంసీకి పైసా పన్నులను సైతం చెల్లించకపోవడం విడ్డూరమని, ఇలాంటి సెంటర్లు, కల్యాణ మండపాలు నగరంలో 5వరకూ ఉన్నాయని, మేయర్, కార్పొరేటర్లను సైతం ధిక్కరిస్తూ నిర్వాహకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పక్కా భవనాలు నిర్మించకూడదన్న నియమాన్ని సైతం పక్కనపెట్టి అనేక అంతస్థుల భవనాలు నిర్మించి హోటళ్లకు, క్యాటరింగ్ సంస్థలకు అద్దెకిస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారని, ఫన్‌టైమ్స్‌లో స్థానికులకు ఫన్ కన్నా నిర్వాహకుల అదనపు ఆదాయం పైనే దృష్టి పెడుతున్నారంటూ మేయర్ కరికాల వలవన్‌కు వివరించారు. టీడీపీ సీనియర్ కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముప్పా వెంకటేశ్వరరావు లేచి మేయర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఫన్‌టైమ్స్‌కు వారు మద్దతుగా నిలవడంతో కొద్దిసేపు మేయర్, వారికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మేయర్ పక్కనే ఆశీనులైన కమిషనర్ నివాస్, కరికాల వలవన్ నిశే్చష్టులై ఇదంతా చూస్తుండిపోయారు.