ఏపీ కాంగ్రెస్ లో ఊపు వచ్చిందా..? విభజనతో పత్తాలేకుండా పోయిన కాంగ్రెస్ .. కొత్త ఊపిరి పోసుకుంటోందా..? అంటే అవుననే అంటున్నారు ఆపార్టీ నేతలు. రాహుల్ గాంధీ రాకతో కాంగ్రెస్ కేడర్ లో కొత్త ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ సభకు వచ్చిన ప్రజానీకం చూసి హస్తం నేతలు ఖుషీ అవుతున్నారు. కాంగ్రెస్ నేతల్లో కాన్ఫిడెంట్ పెరిగింది. ఇప్పటిదాకా జనంలోకి రాని నేతలు .. ఇప్పుడు ధైర్యంగా వెళ్లగలుగుతున్నారు. ప్రజల్లో పార్టీపై ఉన్న వ్యతరేకత పోతోందని సంబరపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నట్టు ఏపీలో పార్టీకి కొత్త కళ వస్తోందా..? విభజనతో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ప్రజాగ్రహం చూసి జనంలోకి రావాలంటేనే జంకేవారు. అయితే ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పార్టీకి పూర్వ వైభవం తేవాలనే ఆలోచనతో హైకమాండ్ ఏపీపై దృష్టి పెట్టింది. సీనియర్ నేత ఉమెన్ చాందీని రంగంలోకి దింపింది. మాజీ నేతల్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించింది. దీంతో ఇక కాంగ్రెస్ దశ మారడం ఖాయమనుకున్నారు. అయితే ఈడోసు సరిపోదని.. ఇదే ఊపులో రాహుల్ ని ఏపీకి తీసుకొచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని గతకొన్నిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్న నేతలు.. ఎట్టకేలకు కాంగ్రెస్ అధ్యక్షుడిని రాష్ట్రానికి రప్పించారు. రాహుల్ రావడంతో కాంగ్రెస్ కేడర్ అంతా తరలివచ్చింది. అయితే కాంగ్రెస్ నేతలు అనుకున్నదానికంటే ఎక్కువగా జనం వచ్చారని సమాచారం. ఇదే ఆపార్టీ నేతల సంతోషానికి కారణం. విభజన తర్వాత ఇంతపెద్ద స్థాయిలో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయలేదు. పార్టీపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలు వస్తారని వారికి నమ్మకం లేదు. సభపెట్టి అభాసుపాలవడం దేనికని కిమ్మనకుండా ఉండిపోయారు. అయితే రాహుల్ గాంధీ సభకు అనూహ్యంగా ప్రజలు తరలివచ్చారు. రాహుల్ గాంధీని చూడగానే వారిలో ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తోంది. వాళ్లు రాహుల్ గాంధీని చూడటానికి వచ్చారా..? లేక కాంగ్రెస్ పై అభిమానంతో వచ్చారాన్నది వేరే విషయం. జనం మాత్రం భారీ స్థాయిలో తరలివచ్చారు. రాహుల్ కూడా కేడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఏపీలో కీలక అంశాలను టచ్ చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ నేతల పేర్లు , వారి గొప్పతనం ప్రస్తావించి రాష్ట్రంపై ఉన్న ప్రేమ చాటుకున్నారు. కాంగ్రెస్ కు ప్రజలు తరలిరావడానికి కారణం వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీకి హోదా ఇస్తానని హామీ ఇచ్చిన బీజేపీ ఆహామీని మరచింది. దీంతో బీజేపీపైనా ఏపీ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కాంగ్రెస్ పై సింపతీ పెరిగి... ఇప్పటిదాకా ఉన్న వ్యతిరేకత బీజేపీ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. పైగా ఎన్నికల వేళ కాంగ్రెస్ కొత్త నినాదం అందుకుంది. ఈసారి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతోంది. అది కూడా ఓ కారణమంటున్నారు విశ్లేషకులు. గతంలో విభజన చేసి చేతులు కాల్చుకున్న కాంగ్రెస్.. ఈసారి తప్పకుండా హామీలు విస్మరించదని విశ్లేషకులంటున్నారు. దీంతో కాంగ్రెస్ పై ప్రజల్లో కాస్త నమ్మకం కలిగినట్టు కనిపిస్తోందంటున్నారు. మొత్తానికి రాహుల్ ని రాష్ట్రానికి రప్పించి పార్టీకి ప్లస్ చేసుకోవాలని భావించిన ప్రయత్నం సఫలమైందంటున్నారు హస్తం నేతలు. ఈ ఎన్నికల్లో అధికారం రాకపోయినా ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.