రెండు రోజులే సమయం…సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలనుందా? తమపై ప్రభుత్వాన్ని కూల్చారన్న నింద పడకుండా కమలం పార్టీ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుందా? ఇప్పుడు ఇదే కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యం, మంత్రి పదవులు దక్కని దాదాపు పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే అసెంబ్లీలో కాంగ్రెస్, జేడీఎస్ ల బలం తగ్గిపోతుంది. 104 మంది సభ్యుల బలం ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముంటుంది.అందుకనే జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చి చేరితే తప్పుడు సంకేతాలు వెళతాయి. అదే రాజీనామాలు చేస్తే ఆ పార్టీలో తలెత్తిన విభేదాల కారణంగానే ప్రభుత్వం కుప్ప కూలిపోయిందని ప్రజలు భావిస్తారు. కమలం పై మచ్చ పడే అవకాశముండదు. ఆపరేషన్ కమల ఈ దిశగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాలు చేస్తే స్పీకర్ దాన్ని ఆమోదిస్తారా? లేదా? అన్నది కూడా బీజేపీకి అనుమానం. అందుకే నేరుగా గవర్నర్ ను కలసి రాజీనామాలు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు కన్నడనాట ప్రచారం సాగుతోంది.అయితే కమలం పార్టీ ప్లాన్ ను పసిగట్టిన కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. అసమ్మతి నేతలతో వరుసగా సమావేశాలు అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జి వేణుగోపాల్, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరలు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు తమకు ఫోన్లు వస్తున్నట్లు అగ్రనేతలకు చెప్పడంతో ఆపరేషన్ కమల స్టార్ట్ అయిందని కాంగ్రెస్ నేతలు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలయినంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి అసంతృప్తులను చల్లార్చకపోతే ప్రభుత్వానికి కష్టాలు తప్పవని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మరో వైపు రాహుల్ గాంధీ కర్ణాటక కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఓ జాబితాను కన్నడ కాంగ్రెస్ అగ్రనేతలు రూపొందించారు. ఏ ఏ కారణాలతో వీరిని మంత్రిపదవికి ఎంపిక చేయాల్సి వచ్చిందన్నది రాహుల్ కు వివరించనున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణపై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చేలా అధిష్టానం వత్తిడి తేవాలని నేతలు నిర్ణయించారు. ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ నేతలు అవసరమైతే మరోసారి క్యాంపును నిర్వహించాలన్న యోచనలో ఉన్నారు.ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం కాంగ్రెస్ పైనే నెపం మోపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కట్టడి చేయకుంటే ఎలా? అని ఆయన వేణుగోపాల్ ను ప్రశ్నించినట్లు సమాచారం. బీజేపీ నేతల ఆకర్ష్ కన్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులే ఎక్కువగా ఉన్నాయని కుమారస్వామి అభిప్రాయపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి ప్రకటన వచ్చి, జాబితా బయటకు వస్తే పదవులు దక్కని వారు వారంతట వారే తమ వద్దకు వస్తారని కూడా బీజేపీ అంచనాగా ఉంది. మరో రెండురోజుల్లో ఏం జరగనుందోనన్న టెన్షన్ జేడీఎస్, కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.