జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఏకధాటిగా ముప్పై ఏళ్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఎంపీగా ఉన్నారు. వయసు కూడా 70 ఏళ్ల పైమాటే! అయినా కూడా ఆయనలో పులుసు తగ్గలేదు. పైగా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లనే వితండ వాదనా ఆయన మానలేదు. ఇప్పటికీ తన మాటే చెల్లుబాటు కావాలనే పంతం, ఎవరినీ లెక్కచేయని తనం.. తన వ్యక్తిత్వానికే కాదు.. ఏకంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాకు, తనకు టికెట్ ఇచ్చిన టీడీపీకి కూడా తలవంపులు తెస్తోంది- ఈ మాట అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ 2014లో ఆయనకు పార్టీ తీర్థం ఇచ్చి కండువా కప్పి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేర్చుకుని ఎంపీటికెట్ కూడా ఇచ్చి గౌరవించిన టీడీపీ అధినేత చంద్రబాబే!! ఇటీవల కాలంలో ఆయన వ్యవహార శైలి చంద్రబాబుకు చాలా తలనొప్పిగా ఉందనేది పార్టీ సీనియర్ల మాట.తాను చేయాలనుకున్న పనిని చేసేయడం, పైగా దానికి పోలీసులను అడ్డు పెట్టుకుని నానా మాటలు అనడం ఆయనకు పరిపాటిగా మారింది. అదేసమయంలో ప్రభుత్వాన్ని సైతం ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న వాదన కూడా బాగా వినిపిస్తోంది. అనంత రైతులకు సాగు నీరు అందించే క్రమంలో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరష్కరించుకోవాల్సిన ఎంపీ.. ప్రభుత్వంపై బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడిపారు. తన ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తానంటూ.. వ్యాఖ్యానించి రాజకీయాలను వేడెక్కించారు. అదేవిధంగా అనంతపురం ప్రధాన రహదారి విస్తరణ విషయంలో నూ ఆయన ఇదే విధంగా వ్యవహరించారు. కీలకమైన అవిశ్వాసతీర్మానంపై పార్లమెంటులో చర్చ పెట్టిన సమయంలో పార్లమెంటుకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఏకంగా చంద్రబాబు ఫోన్ చేసి.. బుజ్జగించాక గానీ.. ఆయన ఢిల్లీ విమానం ఎక్కలేదు స్థానికంగా కూడా సీనియర్ టీడీపీ నేతలుగా ఉన్న అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలకు తెరదీశారు. ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర చౌదరిపై కేసు నమోదు చేయలేదని పోలీసులను దుర్భాషలాడారు. ఇక, ఇప్పుడు తాజాగా తనకు సంబంధం లేకపోయినా.. ఓ వినాయక నిమజ్జన ఘటనను అడ్డు పెట్టుకుని ప్రబోధానంద స్వామి ఆశ్రమం విషయంలో హంగామా సృష్టించడమే కాకుండా.. ఎంపీ అయి ఉండి స్థానిక పోలీసు స్టేషన్ గేటుకు తాళాలు వేయించి ధర్నా చేశారు. ఈ పరిణామాలు తీవ్రంగా టీడీపీని దెబ్బకొట్టాయి. చంద్రబాబు విపక్ష నేతలను పదే పదే అనే రౌడీ రాజకీయాలను ఎంపీ జేసీ చేసి చూపించారనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపించాయి.చంద్రబాబు అంతరంగికంగా తన కేబినెట్ సహచరులతో చర్చించారు. ఇలా అయితే.. కష్టమే! ఎన్నికల సమయంలో పెద్ద తరహా లేకుండా చీప్ పాలిటిక్స్ చేస్తే ఎలా? అని జేసీని ఉద్దేశించి ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఆయన వయసుకు, అనుభవానికి తగిన విధంగా ప్రవర్తించకుండా ఇలా బజారుకు ఎక్కడం ఏంటి? పోలీసు స్టేషన్‌కు తాళాలు వేసి… పోలీసులను హిజ్రాలంటూ దూషించడం, హిజ్రాలను తీసుకు వచ్చివారితోనూ పోలీసులను తిట్టించడం.. ఇవన్నీ మీడియా పెద్దగా ప్రసారం చేయడం పార్టీకి తీవ్ర నష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జేసీ తీరు మారకపోతే.. వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. మొత్తం మీద జేసీ చేసిన హడావుడి ఆయనకే నష్టం కలిగించేలా ఉందని టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.