కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మరో ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిపై నమోదైన ఆరోపణల నుంచి వీరిని స్పెషల్ సీబీఐ కోర్టు, కేరళ హైకోర్టు గతంలో విముక్తి కల్పించాయి. కానీ మరికొందరిపై కేసును కొనసాగించాయి. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న నిందితులపై విచారణను సుప్రీంకోర్టు నిలిపేసింది.పినరయి విజయన్, మరో ఇద్దరిని కేసు నుంచి విడుదల చేస్తూ స్పెషల్ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించడంతో సీబీఐ సుప్రీంకోర్టులో అపీలు చేసింది. దీనిపై జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు నుంచి విడుదలకానటువంటి నిందితులు దాఖలు చేసిన అపీళ్ళపై కూడా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.పినరయి విజయన్ విద్యుత్తు మంత్రిగా పనిచేసిన కాలంలో ఇతర నిందితులతో కలిసి కుట్ర పన్నినట్లు సీబీఐ ఆరోపించింది. టెండర్లు పిలవకుండానే ఎస్ఎన్‌సీ-లావాలిన్‌కు అధిక ధరలకు ఓ కాంట్రాక్టును అప్పగించారని పేర్కొంది. పల్లివసల్, సెంగులమ్, పన్నియార్ జలవిద్యుత్తు ప్రాజెక్టులకు అవసరమైన మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు ఈ కాంట్రాక్టులు ఇప్పించినట్లు తెలిపింది.