ఆసియా కప్‌లో భారత్ గెలుపు నమోదు చేసింది. మంగళవారం గ్రూప్-ఎలో హాంకాంగ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో నెగ్గింది. ధవన్ (120 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 127) సెంచరీతో సత్తాచాటడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో హాంకాంగ్ ఓవర్లన్నీ ఆడి 259/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా నిజాకత్ (92; 113 బంతుల్లో 12×4, 1×6) చెలరేగి ఆడాడు. ఎడాపెడా ఫోర్లు కొట్టాడు. శార్దూల్ బౌలింగ్‌లో సిక్స్‌తో 45 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. షార్దుల్‌తో పాటు భువనేశ్వర్ హాంకాంగ్ ఓపెనర్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. స్పిన్నర్ల చాహల్, కుల్‌దీప్‌లదీ అదే పరిస్థితి. ఐతే వీళ్లతో పాటు కేదార్ జాదవ్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం తగ్గింది. 20 ఓవర్లలో 110/0తో ఉన్న ఆ జట్టు 30 ఓవర్లలో 142/0తో నిలిచింది. 35వ ఓవర్లో ఎట్టకేలకు భారత్ తొలి వికెట్ దక్కింది. అన్షుమన్‌ను కుల్‌దీప్ వెనక్కి పంపాడు. తర్వాతి ఓవర్లోనే.. జోరు మీదున్న మరో ఓపెనర్ నిజాకత్‌ను ఖలీల్ ఔట్ చేయడంతో భారత్ కాస్త ఊపిరిపీల్చుకుంది. ఓపెనర్లు ఔటయ్యాక హాంకాంగ్ ఒత్తిడిలో పడింది. ఇంకో రెండు వికెట్లను త్వరగానే కోల్పోయి 41 ఓవర్లకు 201/4తో నిలిచింది. తర్వాత సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో హాంకాంగ్ లక్ష్యానికి దూరమైంది. అరంగేట్ర బౌలర్ ఖలీల్ అహ్మద్ (3/48) చక్కటి ప్రదర్శన చేశాడు.