నలభై ఐదేళ్లు గా ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఉన్నాను. నన్ను అడ్డగించి ఘటనాస్థలానికి పోనివ్వలేదు. నాకు భద్రత ఇవ్వటం చేతగాని అంగరక్షకులు నాకెందుకని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. అంత పెద్ద ఘటన జరుగుతుంటే ఘటన ఆపటానికి కనీసం గాల్లోకి కాల్పులు కూడా జరపలేదు. మీ వృత్తి ధర్మం మీరు నిర్వర్తించకుండా వుంటే మేం ఏమి అనకూడదా. అసోసియేషన్ ఉందని మీరు ఏమి చెయకపోయినా మేం అడగకూడదా. ఫ్రెండ్లీ పోలీస్ అంటే పిక్ పాకెట్ గాళ్ళకి దండం పెట్టి తప్పు చేశారా? లేదా అని మర్యాదగా మాట్లాడటమా అని నిప్పులు చెరిగారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోభేటీ తరువాత అయన మీడియాతో మాట్లాడారు.
ఈ దుర్ఘటన 16 వ తేదీ జరిగింది. చినపోటామల లో అన్ని మతాల వారు, అన్ని పార్టీల వారు, బలహీన వర్గాలు వారు ఉన్నారు. పార్టీలకు, మతాలకు, వ్యక్తులకు అతీతంగా ఈ ఘటన జరిగింది. యావత్ భారతదేశం వినాయకపూజలు ఆనందం గా, సంబరాలు జరుపుకుంటూ ఉండటం సహజం. అతను స్వామి ఎలా అయ్యాడో. హిందూ మత దేవుళ్ల ను కించపరిచేలా దుర్భాషలాడే వాడు దేవుడా అని ప్రశ్నించారు. వినాయకుని ఊరేగింపు లో జనాలు లేని సమయం చూసుకొని ఆశ్రమం వద్దకు రాగానే స్వామీజీ భక్తులు జనాల పై రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. స్థానికుల పై స్వామి భక్తులు ఇష్టారాజ్యంగా వెంబడించి మారణాయుధాలతో స్వైర విహారం చేశారని ఆరోపించారు. ట్రాక్టర్లు, బైక్ లు, సైకిళ్లు ను తగులబెట్టారు. పెద్ద ఎత్తున ఘటన జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పదిహేను మంది పోలీసు అధికారులు ఉన్నారు. అయినా స్పందించలేదు. పోలీసు అధికారులు పెద్దమనుషులు, పెళ్లికొడుకుల్లా ఘటనాస్థలం వద్దకు వచ్చారని అన్నారు.