తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా గత 6 రోజులలో భక్తులకు అన్నప్రసాదాలను 16.16 లక్షల సర్వింగ్స్ పంపిణీ చేసినట్లు టిటిడి అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్లో బుధవారం అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ గరుడసేవనాడు 5.76 లక్షల అన్నప్రసాదాలు ప్యాకెట్లు అందించినట్లు తెలిపారు. గ్యాలరీల్లోని భక్తులకు బిస్బెల్లా బాత్, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, ఉప్మా, కాఫి, పాలు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంతో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1 మరియు 2, సిఆర్వో, రాంభగీచా విశ్రాంతిగృహం, పిఏసి1, హెచ్విసి, ఏఎన్సి వద్ద ఉన్న ఫుడ్ కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల్లోనూ భక్తులకు అన్నప్రసాదాలు అందించామన్నారు. ప్రతి రోజు 10 టన్నుల కూరగాయలు తిరుమలకు దాతలు అందిస్తున్నట్లు తెలియచేశారు.