ప్రజాసాధికార సర్వేలో అర్హత కలిగి కార్డు లేని 3,51,159 కుటుంబాలకు త్వరలో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం మండలిలో సభ్యులు ద్వారపురెడ్డి జగదీశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కార్డులేని నిరుపేద కుటుoబాలు ఉండకూడదని రాష్ట్రంలో అర్హత కలిగిన 22,42,715 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఈ మొత్తంలో 21,77,441 కార్డులను జన్మభూమి కార్యక్రమాలు ద్వారా లబ్ధిదారులకు అందజేయగా, 65,274 రేషన్ కార్డులను నవ నిర్మాణ దీక్ష, గ్రామదర్శిని కార్యక్రమాలలో అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కార్డు లేని కుంటుంబాలను ప్రజాసాధికార సర్వే డేటా ద్వారా గుర్తించి, ముందస్తుగానే కార్డులు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అర్హత కలిగిన 5,039 ధరఖాస్తులు రేషన్ కార్డుల జారీ కొరకు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి లబ్ధి చేకూర్చాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం అని మంత్రి అన్నారు.