ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో నిరంకుశత్వం పెరిగిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. నిన్న ఏడుగురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ పోలీసులు లాఠీలతో చితక్కొట్టడం ఫై ఆయన చలించి పోయారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. కార్యకర్తలు కింద పడిపోయినప్పటికీ పోలీసులు వారిని వదలకుండా లాఠీలతో బాదుతూ విరుచుకుపడ్డారు. కార్యకర్తలను పోలీసులు కొడుతుండగా తీసిన వీడియోను రాహుల్ గాంధీ ఈ రోజు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి భాజపా సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో నిరంకుశత్వంగా వ్యవహరించడం ఒక వృత్తిలా మారిపోయింది. బిలాస్‌పుర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రాథమిక హక్కులను కూడా హరిస్తూ పోలీసులు క్రూరంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాజకీయ హింసను ప్రజలు గుర్తుంచుకుంటారు’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై పరిష్కారం కోరుతూ రాష్ట్ర మంత్రి అమర్ అగర్వాల్ ఇంటి ముందు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు తమ కార్యకర్తలను తీవ్రంగా కొట్టారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ ఆందోళనలో పాల్గొన్న 52 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.కాగా వారు రాష్ట్ర మంత్రి ఇంట్లో చెత్త వేశారని అందుకే తాము కొట్టాల్సి వచ్చిందని పోలీసులు అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఓ విషయంపై ఆందోళనకు దిగారని, వారిలో ఏడుగురు తమ పోలీసులతో గొడవ పడ్డారని తెలిపారు.