ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాల్సిన వైసీపీ ఆచితూచి అడుగులేస్తున్నారా? జగన్ ప్రజాసంకల్ప యాత్రతో వచ్చిన క్రేజ్‌ను బలహీన అభ్యర్థులను పోటీకి దింపకూడదని నిర్ణయించారా? అంటే తాజా పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలు వాస్తవానికి వైసీపీకి ప్రాణసంకటం. పార్టీ ఆర్థికంగా ఎదగాలన్నా.. జగన్ సీఎం కోరిక నెరవేరాలన్నా కూడా వచ్చే ఎన్నికలే ప్రాతిపదిక. అయితే, దీనికి సంబందించి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశిస్తాయనడంలో ఎటువంటి సందేహంలేదు. వైసీపీ తరఫున రంగంలోకి దిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నేతలు రంగంలో కాచుకుని కూర్చున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. గెలుపు గుర్రంగా తాము మారతామని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినా సర్వేల ఆధారంగానే జగన్ అభ్యర్థుల ఎంపిక చేయాలని నిర్ణయించారు. రాజధాని జిల్లా సహా పలు జిల్లాల్లో వైసీపీ తరఫున టికెట్ గ్యారెంటీ అనుకున్న నాయకులు ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు. అయితే, ఇంతలోనే జగన్ నిర్ణయం అనూహ్యంగా మారిపోయింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో పట్టు పెంచుకున్న నాయకులను అక్కడ నుంచి వేరే నియోజకవర్గాలకు మార్చడం, మరికొందరికి అసలు టికట్టే లేకుండా చేయడం, ఇంకొందరిని పార్టీ నుంచి సైతం బయటకు పంపుతుండడం వంటి పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే గుంటూరు జిల్లా. ఇక్కడ గురజాల నియోజకవర్గంలో పార్టీనే నమ్ముకున్న జంగా కృష్ణమూర్తిని గురజాలతో తప్పించడం, అదేవిధంగా అత్యంత కీలకమైన చిలకలూరిపేట నియోజవకర్గంలో మర్రి రాజశేఖర్‌ను పక్కన పెట్టడం, ఇక తాజాగా గుంటూరు ఎంపీ సీటు సమన్వయకర్తగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులును నరసారావుపేటకు పంపడం వంటివి వైసీపీకి ప్రయోజనం చేకూరుస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.జగన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న వారిని కూడా జగన్ బాధ్యతల నుంచి తప్పించేస్తున్నారు. వినుకొండ ఇన్‌చార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు పరిస్థితి దారుణంగా ఉంది. ఈయనకు కూడా పొగబెట్టి ఈయన స్థానంలో గుంటూరుకు చెందిన ఓ డాక్టర్ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదేవిదంగా పెదకూరపాడులో కావటి మనోహర్‌నాయుడుకు టికెట్ ఇవ్వకుండా ఈయన స్థానంలో నంబూరు శంకరరావు లేదా మరో వ్యక్తికి ఇవ్వాలని డిసైడ్ చేశారట అదేవిధంగా నరసారావుపేట – సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డిని బలవంతంగా తప్పించేసి ఆ ప్లేస్‌లో గురజాల ఇన్‌చార్జ్ కాసు మహేష్‌రెడ్డికి చివర్లో అయినా టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో తెనాలి అన్నాబత్తుని శివకుమార్‌ను తప్పించి మరో వ్యక్తి కోసం అన్వేషణ, తాడికొండ క్రిస్టియానాను తప్పిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే జగన్ మాత్రం పూర్తిగా సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తుండటంతో…తన…మన…లేకుండా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పరిణామమేనంటున్నారు వైసీపీ నేతలు.