YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గంజాయి మత్తు

గంజాయి మత్తు

నెల్లూరు:

జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు బీజం పడుతోంది. గంజాయి, డ్రగ్స్ తరలింపునకు జిల్లా అడ్డగా మారుతోంది. ఈక్రమంలోనే యువత, విద్యార్థులు మత్తుకు అలవాటు పడి నిండు జీవితాలను నాశనం చేసుకొంటున్నారు. విశాఖ, తూర్పు గోదావరి మన్యం ప్రాంతాల్లో పండించిన గంజాయిని అర్థరాత్రి వచ్చే రైళ్లల్లో లగేజీ బ్యాగులు, ఇతర సంచుల్లో సరుకులు పేరిట గుట్టుగా జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. రవాణా సమయంలో పోలీసులు, అబ్కారీశాఖ అధికారుల పోకడలు తెలియజేసేందుకు పైలట్లను కూడా నియమించుకొంటున్నారు. వారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ గంజాయి రవాణాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు.ఇందులో కొందరు పెద్దల అండ దండలున్నాయి. దాడుల్లో పట్టుబడినప్పుడు కేసుల నుంచి తప్పించేందుకు తోడ్పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో పలు ప్రాంతాలకు తీసుకు వెళ్లి విక్రయ కేంద్రాలకు అమ్ముకొంటున్నారు. విక్రయ కేంద్రాల్లో విద్యార్థులు, యువత, మత్తుకు అలవాటు పడిన వారు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు విక్రయదారులు విద్యార్థుల చరవాణి నంబర్లకు సమాచారం ఇచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే మత్తులో జోగుతున్నారు. చదువులు నాశం చేసుకొంటున్నారు. విక్రయదారులు మాత్రం లక్షలాది రూపాయలు సంపాదించుకొంటున్నారు. జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, వెంకటగిరి, మనుబోలు, వెంకటాచలం రైల్వే స్టేషన్ల పరిధిలోని పరిసర ప్రాంతాల మీదుగా ఆక్రమ రవాణా జరుగుతోంది. అక్కడి నుంచి విక్రయ కేంద్రాలకు కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాల్లో తరలిస్తున్నారు. ఇక కొందరు లగేజీ బ్యాగుల్లోనూ తరలిస్తున్నారు.తిరుమల ఎక్స్‌ప్రెస్‌, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌, హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో గంజాయి జిల్లాకు వస్తుంది. విశాఖ, అరకు, తూర్పుగోదావరి మన్యం ప్రాంతాల నుంచి తీసుకు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జిల్లా నుంచి తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలోని కోట, గూడూరు, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో విచ్చల విడిగా విక్రయ కేంద్రాలున్నాయి. కోట మండలంలోని శ్యాంసుందరపురం, అడ్డరోడ్డు, విద్యానగర్‌, ప్రకాశంకాలనీ, పలు ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. కోట మార్గంలో తనిఖీ కేంద్రాలు లేనందు వలన విచ్చల విడిగా రవాణా చేస్తున్నారు. గూడూరులోని రైల్వే స్టేషను పరిసరా ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. అక్కడ యువత గంజాయిని బహిరంగంగా పీల్చుతున్నారు.

Related Posts