సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గడువును అక్టోబరు 15 వరకు పొడిగిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే రైతులు స్థానిక తహసీల్దార్‌ని సంప్రదించాలన్నారు. క్రమబద్ధీకరణ నిర్ణయం ద్వారా చిన్న, సన్న కారు రైతులకు మేలు కలుగుతుందని కేఈ వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. తెల్లకాగితాలు, రిజిస్ట్రేషన్ చేయని ఇతర పత్రాలపై చేసుకున్న ఒప్పందాల భూములను ఎలాంటి స్టాంప్ డ్యూటీ లేకుండా రైతుల పేరు మీద క్రమబద్ధీకరిస్తున్నామన్నారు.2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట పొలం ఉన్న రైతులకు ఇది వర్తిస్తుందని, వీరికి స్టాంప్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తున్నామన్నారు. రైతులు ఇచ్చిన సేల్ డీడ్ నిజమైందా? కాదా? అనేది నిర్ధారించుకొని భూమిని సంబంధిత రైతు పేరు మీద క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. సాదాబైనామాల రిజిస్ట్రేషన్ కేవలం వ్యవసాయ భూములకే వర్తిస్తుందన్నారు. కార్పోరేషన్ లు, మున్సిపాల్టీలు, నగరపంచాయితీల్లో జరిగిన అన్ రిజిస్టర్ సేల్ డీడ్‌లకు ఇది వర్తించదని ఉపముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణ మూర్తి తెలిపారు.