వైఎస్ జగన్ పాదయాత్ర ఈ నెల 24వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గరలోని దేశపాత్రునిపాలెం వద్ద 3000కిలోమీటర్ల మైలురాయిని చేరనుందని, ఈ సందర్భంగా అక్కడ ఓ భారీ బహిరంగ సభ నిర్వహించి.. ఫైలాన్‌ను ఆవిష్కరించబోతున్నామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. వైఎస్ జగన్ పాదయాత్రకు అంతరాయం కలిగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు. పార్టీ శ్రేణులు వాటినన్నింటినీ అధిగమించి పాదయాత్రను విజయవంతం చేశాయని సంతోషం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్లు కదిలివస్తున్నాయని తెలిపారు. దేశంలోనే వైఎస్ జగన్ వంటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరని అభిప్రాయపడ్డారు. ఆయన పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణతోనే చంద్రబాబు పాలన అంతానికి అంకురార్పణ జరిగిందని అన్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ విజయం సాధించారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు పాలనను వైఎస్సార్ ఎలా అంతమొందించారో.. ఇప్పుడు అలానే వైఎస్ జగన్ పునరావృతం చేస్తారని అన్నారు. జననేత పాదయాత్ర ఇప్పటివరకు.. 116 నియోజకవర్గాల్లోని 193 మండలాల్లో.. 1650 గ్రామాల మీదుగా సాగిందని, అదేవిధంగా 44 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్ల పరిధిలో పాదయాత్ర జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు పాదయాత్రలో భాగంగా 106 సభలు, 41 ఇంట్రాక్షన్లు జరిగాయని వివరించారు. 269వ రోజు పాదయాత్ర దేశపాత్రునిపాలెంలోకి ప్రవేశిస్తుందని, అక్కడ 107వ బహిరంగ సభ జరగనుందని వెల్లడించారు.
పాలిటెక్నిక్ స్టూడెంట్స్ తో జగన్ భేటీ
జాబు కావాలంటే జగన్ రావాలి. జగనే నెక్ట్స్ సీఎం కావాలి అంటూ సాయిగణపతి పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాయిగణపతి ఇంజినీరింగ్, పాలి టెక్నిక్ కళాశాలల ముందు నుంచి పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల గేటు వద్ద వందలాది మంది విద్యార్థులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. జగనన్న సీఎం కావాలి మా అందరికి ఉద్యోగాలు రావాలి అని వారంతా పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కోర్సుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అరకొరగానే వస్తోందని, కోర్సు పూర్తి చేసిన వారికి మూడేళ్ల తర్వాతే ధ్రువీకరణపత్రాలు ఇస్తున్నారని పలువురు విద్యార్థులు జననేత దృష్టికి తీసుకెళ్లారు.