YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జయలలిత మరణ మిస్టరీ వీడేది లేదు

జయలలిత మరణ మిస్టరీ వీడేది లేదు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీ వీడే అవకాశాలు కనిపించడం లేదు. కేసులో కీలకంగా భావిస్తున్న జయలలిత చికిత్స వీడియోలు తమ వద్ద అందుబాటులో లేవని అపోల్ అస్పత్రి యాజమాన్యం విచారణ కమిషన్‌కు తెలిపింది. దీంతో జయ మరణంపై భవిష్యత్తులోనూ వాస్తవాలు బయటకు రావన్న అభిప్రాయాలు తమిళ ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు సీఎంగా పదవిలో ఉన్న సమయంలోనే ఎంజీ రామచంద్రన్‌ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. అయితే ప్రజల కోరిక మేరకు ఆస్పత్రిలో ఎంజీఆర్‌ చికిత్స పొందుతున్న దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. సరిగ్గా జయలలిత విషయంలోనూ ట్రీట్ మెంట్ వీడియోలు చూపించి నిజాలు వెల్లడిస్తారని అంతా భావించారు. కానీ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయ చనిపోయినా.. అందులో ఆమె నెచ్చెలి శశికళ కుట్ర ఉందని ఆరోపణలున్నాయి. ఈ కారణంగా అన్నాడీఎంకే పార్టీలోనూ చీలిక వచ్చింది. సీబీఐ విచారణకు ఒత్తిడి పెరగడంతో రిటైర్డు న్యాయమూర్తి ఆరుముగస్వామి చైర్మన్‌గా తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. వందమందికి పైగా కమిషన్ ఎదుట హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. చికిత్స అందిస్తున్న వైద్యులను సైతం కమిషన్ విచారించింది. ట్రీట్ మెంట్ సమయంలో రికార్డు చేసిన దృశ్యాలు, వీడియోలను సమర్పించాలని చెన్నై అపోలో వైద్యులను పలుమార్లు కమిషన్ సభ్యులు కోరారు. తమ వద్ద వీడియో, ఫొటోలు లేవని కమిషన్‌కు వివరించినట్లు అపోలో ఆస్పత్రి లాయర్ మైనాబాష చెప్పారు. వీవీఐపీలు ఉండేచోట కెమెరాలు ఉండవని ఈ నెల 11న లిఖితపూర్వకంగా కమిషన్‌కు వెల్లడించామన్నారు. కొత్త వీడియోలు రికార్డవుతుంటాయని, పాతవి కేవలం నెల రోజులు మాత్రమే ఉంటాయని వివరించారు. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమయంలో టీటీవీ దినకరన్ అనుచరుడు వెట్రివేల్.. ‘అమ్మ’ జయలలిత చికిత్స వీడియోలు విడుదల చేయడం వివాదాస్పదమైంది. కాగా, సీసీటీవీ ఫుటేజీలు లేకపోవడంతో జయ కేసు మిస్టరీ వీడే అవకాశాలు తగ్గిపోయాయి.

Related Posts