యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ నుంచి గాయాల కారణంగా ముగ్గురు భారత క్రికెటర్లు అర్ధాంతరంగా వైదొలిగారు. టోర్నీలో ఇప్పటికే హాంకాంగ్, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు ఘన విజయాలతో సూపర్-4లోకి ప్రవేశించగా.. శుక్రవారం బంగ్లాదేశ్‌తో తదుపరి మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్, ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా టోర్నీ నుంచి గురువారం వైదొలిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. వారి స్థానాల్లో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ కౌల్‌ని ఎంపిక చేశారు. పాకిస్థాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వెన్నుకి గాయమైంది. దీంతో బంతి విసిరిన తర్వాత పిచ్ మధ్యలోనే ఈ ఆల్ రౌండర్ కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు ఫిజియో సపర్యలు చేసినా.. అతను కనీసం నిల్చోలేకపోవడంతో.. స్ట్రెచర్ మీద మైదానం నుంచి వెలుపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ చేతి వేలికి గాయమైంది. వీరితో పాటు హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ కూడా గాయపడటంతో.. ముగ్గురూ టోర్నీకి దూరమైనట్లు తాజాగా బీసీసీఐ ప్రకటించింది.