కేంద్రం తీరుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. మొదట వామపక్షాలు బంద్‌కు పిలుపునివ్వగా అనంతరం వైసీపీ, కాంగ్రెస్, జనసేనతో పాటు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీడీపీ కూడా రాష్ట్రబంద్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చింది. శాంతియుతంగానే టీడీపీ కార్యకర్తలు నిరసనలు తెలపనున్నారు. బంద్ కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఆఖరికి ప్రైవేట్ బస్సులు సైతం రోడ్డెక్కలేదు. బస్‌డిపోల ముందు వామపక్ష, వైసీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు కూడా బంద్ పాటిస్తున్నాయి. వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ప్రధాన దారుల్లో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.