2018-19 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ పరీక్ష మే నెల 23,24వ తేదీలలో జరుగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఏడుసార్లు ఐసెట్ పరీక్షను సమర్థంగా నిర్వహించిన కాకతీయ విశ్వవిద్యాలయమే ఈసారి కూడా పరీక్షను నిర్వహించనుంది. కాకతీయ విశ్వవిద్యాలయం ఐసెట్ సెమినార్ హాల్‌లో వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న అధ్యక్షతన బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పాపిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఐసెట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వహించేవారమని, ఈ ఏడాది ఐసెట్ పరీక్షను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ నెల 22వ తేదీన ఐసెట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని, జూన్ 6వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో మొత్తం 16 రీజనల్ సెంటర్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ ఐసెట్ పరీక్షను ఇప్పటికే ఏడుసార్లు పకడ్బందీగా నిర్వహించిందని, ఈసారి కూడా అంతే సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఐసెట్-2018 కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రమణ్యశర్మ మాట్లాడుతూ.. రెండున్నర గంటలపాటు నిర్వహించే ఐసెట్ పరీక్ష మూడు సెషన్లలో ఉంటుందని చెప్పారు. మే 23వ తేదీన ఉదయం 10గంటల నుంచి 12.30గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30నుంచి 5గంటల వరకు రెండవ సెషన్‌లో పరీక్ష జరుగుతుందని అన్నారు. మే 24వ తేదీన ఉదయం 10నుంచి 12.30గంటల వరకు మూడవ సెషన్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఐసెట్ పరీక్ష ఫీజును జనరల్ అభ్యర్థులకు రూ.650గా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450గా నిర్ణయించినట్లు తెలిపారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్, ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసెట్ పరీక్షను ఈసారి ఉర్దూ మీడియంలో నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.