మచిలీపట్నం ఓడరేవు పరిస్థితి ఒక అడుగు ముందుకు..పది అడుగుల వెనక్కు అన్న చందంగా తయారైంది. నవయుగా సంస్థ ఈ ఓడరేవు ప్రాజెక్టును దక్కించుకున్నా భూ కేటాయింపులు పూర్తి చేయకపోవటంతో పనులు ఏమీ మొదలు కావటంలేదు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు నవయుగా సంస్థకు అప్పగించారు. అప్పట్లో టీడీపీ దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆందోళనలు కూడా చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు కావస్తున్నా..పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు. ఓడరేవుకు అవసరమైన భూమితోపాటు పారిశ్రామిక కారిడార్ కు భారీ ఎత్తున భూ సేకరణ పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రైతులు ల్యాండ్ పూలింగ్ కు ససేమిరా అంటుండటంతో ఈ ప్రక్రియ ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది. రాజధానిలో మాత్రం ల్యాండ్ పూలింగ్ కింద 33 వేల ఎకరాలు సేకరించిన సర్కారు ఇక్కడ మాత్రం ఫెయిల్ అయింది.
రాజధానితో పోలిస్తే భూ యాజమానులకు ఇక్కడ ఇఛ్చే ప్యాకేజీ ఏ మాత్రం ఆకర్షణీయంగా లేకపోవటంతో రైతులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పారిశ్రామికవాడ సంగతి అటుంచి ఓడరేవు కూడా ఆగిపోయిన పరిస్థితి. మచిలీపట్నంలో కార్గో అంత లాభదాయంగా ఉండదని..పారిశ్రామికవాడను లింక్ చేస్తే తప్ప..ఇది ఉపయోగపడదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే రైతులు భూ సమీకరణకు నో చెప్పటంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశాలు లేవని చెబుతున్నారు. జూన్..జూలై నెలాఖరు నాటికి కానీ కంపెనీ భూ సేకరణకు అయ్యే నిధులు సమీకరించుకోవాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.