కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వయంగా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారా? ఆయన అనుచరులు ఆయనపై వత్తిడి తెస్తున్నారా? రాజకీయాల్లోకి రావాలన్న అనుచరులు, సన్నిహితుల వత్తిడికి ముద్రగడ తలొగ్గుతున్నారా? అవుననే అంటున్నారు. ఎన్నికల మూడ్ దాదాపు ఏపీలో వచ్చేసింది. దీంతో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసినా ఫలితం ఉండదు. ఈతరుణంలో వైసీపీ అధినేత జగన్ కూడా కాపు రిజర్వేషన్ల అంశం తమ పరిధిలో లేదని, కేంద్రం వల్లనే సాధ్యమవుతుందని చెప్పేశారు. అప్పటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉన్న ముద్రగడ జగన్ పై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. తమ సామాజిక వర్గాన్ని అన్ని పార్టీలూ అణిచివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. కొద్ది రోజులుగా ముద్రగడపై ఆయన అనుచరులు వత్తిడి తేవడం ప్రారంభించారు. తమ సమస్యలు పరిష్కారం కావాలంటే జనసేనకు జై కొట్టాల్సిందేనని ముద్రగడపై వత్తిడి ప్రారంభమయింది. పవన్ కల్యాణ్ కు అండగా నిలబడాలన్న డిమాండ్ ఆ సామాజికవర్గం నుంచి పెరుగుతోంది. జనసేన ఎక్కువ సీట్లు సాధించగలిగితే కర్ణాటకలో మాదిరిగా కింగ్ మేకర్ అయ్యే అవకాశముందని, అప్పుడు కాపు రిజర్వేషన్లు సాధ్యమవుతాయని ముద్రగడపై వత్తిడి తెస్తున్నారు. ముద్రగడ కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. జనసేన తరుపున తాను కూడా స్వయంగా ఎన్నికల బరిలో నిలిచే ఆలోచన చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద ముద్రగడ ఇప్పటి వరకూ కాపు ఉద్యమనేతగానే ఉన్నారు. మరి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారన్న వార్తలు తెలియడంతో కిర్లంపూడిలోని ఆయన నివాసం కిటకిటలాడుతోంది.ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ముద్రగడను పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నాయంటున్నారు. గత కొద్దిరోజులుగా ఏపీలో ప్రధాన పార్టీలు కాపు సామాజిక వర్గాన్ని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తుందన్న అనుమానాలు ఆ సామాజిక వర్గం నేతల్లో వ్యక్తమవుతోంది.ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంది. దీంతో కాపు రిజర్వేషన్ల అంశం దాదాపు కనుమరుగయినట్లే. చంద్రబాబు కాపు రిజర్వేషన్లు అమలుకాకపోవడాన్ని కేంద్రంపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ముద్రగడ బహిరంగ లేఖలు రాసినా స్పందన లేదు.