YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అక్టోబర్ 15 కు చంద్రబాబు కేసు వాయిదా

అక్టోబర్ 15 కు చంద్రబాబు కేసు వాయిదా
బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు తరపు లాయర్లు శుక్రవారం నాడు ధర్మాబాద్ కోర్టుకు హాజరైయ్యారు. అడ్వకేట్, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ నేతృత్వంలో లాయర్ల బృందం ధర్మాబాద్కు వెళ్లింది. కోర్టులో ఏపీ ప్రభుత్వం రీకాల్ పిటిషన్ వేసింది. అయితే, ఆ  రీకాల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు సహా నోటీసులు అందుకున్న వారంతా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్ లపై అరెస్ట్ వారెంట్ ను రద్దు చేసి, బెయిల్ మంజూరు చేసింది.ఒక్కోక్కరికి ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన ఆందోళనకు సంబంధించి ధర్మాబాద్ కోర్టు విచారణ చేపట్టింది. బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని చంద్రబాబుతో పాటు మరి కొందరు టీడీపీ నేతలు ఆందోళన చేశారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నారని, 144 సెక్షన్ ను ఉల్లంఘించారని చంద్రబాబు సహా 16 మందికి 8 ఏళ్ల తర్వాత వారెంట్లు జారీ అయ్యాయి. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.  ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.  కేసు విచారణ  సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఎవరికీ కోర్టు నుంచి మినహాయింపులు ఉండవని చెప్పారు. తదుపరి విచారణకు నోటీసులు అందుకున్న వారంతా కోర్టుకు రావాలని ఆదేశించారు. 

Related Posts