YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఠారెత్తిస్తున్న రోగాలు

 ఠారెత్తిస్తున్న రోగాలు
ఖమ్మంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల సంతతి పెరిగిపోవడమే దీనికి కారణం. పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు సరిగా సాగకపోవడం వల్లే రోగాల వ్యాప్తికి అడ్డుకట్ట పడడంలేదన్న విమర్శలూ చక్కర్లు కొడుతున్నాయి. ఏదైతేనేం.. జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రజలు విష జ్వరాలతో సతమతమవుతున్నారు. ఇంట్లో ఎవరైనా జ్వరం బారిన పడితేచాలు ఆ వైరస్‌ మిగిలిన కుటుంబ సభ్యులకూ సోకుతోంది. దీంతో ఇంటిల్లిపాదీ అనారోగ్యం పాలవుతున్న దుస్థితి. వైద్యం కోసం బాధితులంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ జ్వరాల ప్రభావం ఎంతగా ఉందంటే కొన్ని పల్లెల్లో మధ్యాహ్నం సమయంలో ఒక్కరూ కనిపించడం లేదు. అంతా ఆసుపత్రులకే వెళ్తున్న పరిస్థితి. అక్కడక్కడా ఒకరిద్దరు ఉన్నా వారూ జ్వరపీడితులే. విష జ్వరాల ఎఫెక్ట్‌తో పలువురు పనిపాటలకు దూరమై మంచాలకే పరిమితమయ్యారు. గ్రామాల్లో అయితే వ్యవసాయ పనులు కూడా సక్రమంగా సాగడం లేదు. ఇక పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్‌మాల్స్, ఇతర దుకాణాలు అనే తేడాలేకుండా సిబ్బంది సెలవులు పెట్టేశారు. జిల్లాలో దోమల వల్లే విషజ్వరాలు ప్రబలుతున్నాయని పలువురు అంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే దోమలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో దోమలను అరికట్టలేక అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారని విమర్శిస్తున్నారు.ప్రజలను చైతన్యవంతులను చేసి ముందస్తు జాగ్రత్తలు వహించే విధంగా కూడా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయలేదని మండిపడుతున్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కూడా వైరల్ ఫీవర్స్ వ్యాప్తికి దోహదం చేసిందని అంటున్నారు. 
ఇదిలాఉంటే వైరల్ ఫీవర్స్‌ను పలు ప్రైవేట్ హాస్పిటల్స్ పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాయి. బాధితులు ఎక్కువగా ఉండడంతో అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలైతే వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లాలో ప్రధానంగా డెంగీ, గన్యాలు ప్రజలను భయపెడుతున్నాయి. డెంగీ జ్వరం ఎడీస్‌ ఈజిప్టి అనే దోమ, గన్యా ఎనాఫిలస్‌ దోమ కారణంగా సోకుతుంది. ఈ సంవత్సరం వీటి వ్యాప్తి పదిరెట్లు అధికంగా ఉండడంతో అంతా భయపడుతున్నారు. ఈ వైరస్‌ సోకితే తొలుత ఒళ్లు, కీళ్లనొప్పులు, వెన్ను నొప్పి, కాళ్లనొప్పులు, ఆయాసం, రక్తకణాలు పడిపోవడం, రక్తపోటు తగ్గిపోవడం, తర్వాత కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. సకాలంలో వీటిని గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. అలా చేస్తే రోగం అదుపులోనే ఉంటుంది. ఇక కొన్ని గ్రామాల్లో అయితే డెంగీ వైరస్‌ దాటికి ప్రజలు అల్లాడుతున్నారు. నిజానికి ఈ వైరస్‌కు మందులేదని వైద్యులు చెప్తున్నారు. ఇది వైరస్ ప్రాణాంతకం కాదని కూడా అంటున్నారు. వ్యాధి లక్షణాలనుబట్టి చికిత్స చేసుకొని తగ్గించుకోవాలే తప్ప ఇతర మార్గాలను అనుసరించకూడదని స్పష్టంచేస్తున్నారు. అయితే కొంతమంది పట్టణ, గ్రామీణ వైద్యులు డెంగీ వైరస్‌ను బూచిగా చూపి రోగిని మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. లేనిపోని భయాందోళనలు రేకెత్తించి బాధితుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఖమ్మంలో విజృంభిస్తున్న విష జ్వరాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం వైద్య విభాగంతో పాటూ పారిశుద్ధ్య విభాగమూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 

Related Posts