నమస్తే తెలంగాణ: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా తలపెట్టిన ఉల్పర రిజర్వాయర్‌తో ఒక్క ఎకరా ముంపు కూడా లేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. అతితక్కువ ముంపుతో రైతులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బుధవారం జలసౌధలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉల్పర రిజర్వాయర్ నిర్మాణంవల్ల ముంపునకు గురవుతామనే భయాందోళనలు అవసరంలేదని మంత్రి స్పష్టంచేశారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యంపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దన్న మంత్రి.. ఒకటీ లేదా మూడు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మిస్తారన్న వార్తలను ఖండించారు. కేవలం 0.25 టీఎంసీ సామర్థ్యంతోనే ఉల్పర రిజర్వాయర్ నిర్మాణమవుతున్నదని తేల్చిచెప్పారు. దీనిపరిధిలో దాసరాజుపల్లి గ్రామం ముంపునకు గురవుతుందనే ప్రచారాన్ని నమ్మొద్దని, ఆ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురికాదన్నారు.
మత్య్స కారులకు శాశ్వత ఉపాధి
భూ నిర్వాసితులకు మార్కెట్ ధర ప్రకారం తగిన పరిహారం చెల్లిస్తామని మంత్రి హరీశ్‌రావు వారికి హామీ ఇచ్చారు. ఎన్‌ఎస్పీ చీఫ్ ఇంజినీర్ సునీల్, రెవిన్యూ అధికారులతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనా వేస్తారని మంత్రి చెప్పారు. ఉల్పర రిజర్వాయర్ కింద రెండు పంటలకు నీళ్లు అందుతాయని, మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభించనున్నదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పంటలు వేసుకొని ఉన్నందున దిగుబడి వచ్చే వరకు కాల్వల తవ్వకం జరుగదని కూడా మంత్రి వారికి భరోసా కల్పించారు. రెండు, మూడునెలల తర్వాత ఆర్డీవో ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకొంటామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కాల్వల వెడల్పు తగ్గించి, భూసేకరణ తగ్గించాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రత్యామ్నాయాలు పరిశీలించి, నిర్ణయం తీసుకొంటామని అన్నారు.
సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అం దించాలని అచ్చంపేట శాసనసభ్యుడు బాలరాజు మంత్రికి విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి అచ్చంపేట నియోజకవర్గానికి 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఈ ఎస్ సునీల్, సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.