హిందూ, ముస్లింల ఐక్యతగా నిలిచే ప్రసిద్ధ రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. బారా షహీద్ దర్గా ఆవరణలో ఉన్న స్వర్ణాల చెరువులో స్నానం చేసి.. రొట్టె తీసుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రొట్టెల పండుగకు హాజరుకానున్నారు. సెప్టెంబరు 23 ఉదయం బారా షహీద్ దర్గాను పవన్ సందర్శించి, రొట్టెలను అందుకోనున్నారు. శనివారం సాయంత్ర హైదరాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకోనున్న పవన్, రాత్రికి ఓ హోటల్‌లో బసచేస్తారు. ఆదివారం ఉదయం దర్గాను దర్శించిన అనంతరం వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపొందాలని కోరుకుంటూ స్వర్ణాల చెరువులో తమ పార్టీ ముఖ్యనేతల ద్వారా ‘గెలుపు రొట్టె’అందుకుంటారు. ఇది పూర్తయిన తర్వాత నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి భవన్‌లో జనసేన ముఖ్యనేతలతో సమావేశమవుతారు. పరిమితి సంఖ్యలోనే కేవలం ఎంపిక చేసిన 50 మందితోనే పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. తర్వాత విద్యార్థులు, యువత, రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. పవన్ కళ్యాణ్ నెల్లూరు పర్యటనను పార్టీ ఖరారు చేసింది. అయితే, టూర్ షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.