తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో విజయదశమి రోజున అధికారికంగా జనసేనలో చేరనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తెదేపాలో సరైన గుర్తింపు లేకపోవడంతోపాటు ఇటీవల బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు సరైన గౌరవం ఇవ్వనందునే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యానని అనుచరుల వద్ద కృష్ణమూర్తి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్న చదలవాడ కొంతకాలంగా క్రియాశీలంగా లేరు. తాజాగా కొన్ని పరిణామాలు కూడా ఆయన పార్టీని వీడేలా చేశాయని సమాచారం. ఆయన 1973లో కాంగ్రెస్ పార్టీలో చేరి.. 1976-77లో నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1981లో నాయుడుపేట పంచాయతీ సర్పంచిగా గెలిచారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1983లో ఉత్తమ సర్పంచిగా బహుమతి అందుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో తిరుపతి శాసనసభ ఎన్నికల బరిలో నిలవాలని భావించగా.. కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి టిక్కెట్టును కేటాయించింది. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తిరిగి 1999 లోనూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి టిక్కెట్టు ఇచ్చేందుకు నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీలో చేరి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2003లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద నక్సలైట్లు చేసిన దాడిలో చదలవాడ కృష్ణమూర్తి సైతం గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక.. 2015 ఏప్రిల్‌లో ఆయణ్ను తిరుమల, తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా నియమించింది.