ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మవారి సన్నిధిలో అక్టోబర్ 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు అమ్మవారి దసరామహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అందరికీ అమ్మవారి దర్శనం కలిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా భక్తులకు అప్పం ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని దసరా మహోత్సవాల నుండే ప్రారంభిస్తున్నారు.
ఇదేవిధంగా వీఐపీలు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా గత దసరా మహోత్సవాల్లో చేసిన విధంగా ఈసంవత్సరం కూడా పున్నమి ఘాట్ నుండి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విజయదశమి రోజున అమ్మవారు ఉదయం శ్రీ మహిషాశురమర్ధనీ దేవి అలంకారం, మధ్యాహ్నం నుండి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనుంది. ఈ మహోత్సవాలు సందర్భంగా ప్రతిరోజు అమ్మవార్లకు నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.దుర్గగు డిలో జరగనున్న దసరా మహోత్సవాల సందర్భంగా అక్టోబర్ 10న కనకదుర్గమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గదేవి అలంకారంలో, 11న బాలాత్రిపురసుందరీ దేవిగా, 12న గాయత్రి దేవిగా, 13న లలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. 14న సరస్వతి దేవి (మూలానక్షత్రం) అలంకారంలో, 15న అన్నపూర్ణాదేవిగా, 16న మహాలక్ష్మీదేవిగా, 17న దుర్గాదేవిగా, 18న మహిషాసుర మర్థనిదేవి, రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. అక్టోబర్ 14వ తేది మధ్యాహ్నం 3 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వరకు మూలానక్షత్రం ఉంటుందని, అక్టోబర్ 18న విజయదశమి అని శర్మ తెలిపారు.అదేరోజు 12 గంటలకు జరగనున్న పూర్ణాహుతి కార్యక్రమంతో దసరా మహోత్సవాలు ముగుస్తాయని చెప్పారు.గత ఏడాది దసరా మహోత్సవాలకు 9 కోట్లు ఖర్చు అయ్యాయని, ఈసారి సుమారు 10 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతను ఘంటసాల సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించారు.