హెచ్ 1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు మరోసారి కష్టకాలం ఎదురైంది. వీరి పని అనుమతిని రద్దుచేసే విషయంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ సర్కార్ నేడు ఫెడరల్ కోర్టుకు తెలిపింది. హెచ్4 వీసాదారుల(హెచ్ 1బీ భాగస్వాములకు ఇచ్చే వీసా) పని అనుమతిని రద్దు చేస్తామని గత కొంతకాలంగా ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగానే చెబుతోంది. తాజాగా మరో మూడు నెలల్లోగా దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు కోర్టుకు చెప్పింది. దీంతో హెచ్4 వీసాదారులు ఆందోళనకు గురవుతున్నారు.హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్నవారి భాగస్వాములు హెచ్4 డిపెండెంట్ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేయొచ్చని పేర్కొంటూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్‌ను రద్దు చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 28న ట్రంప్ సర్కార్ ప్రకటించింది.అయితే, కొన్ని కారణాల వల్ల దీన్ని వాయిదా వేసింది. గత జూన్‌లోనూ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. మరికొంతకాలం వాయిదా వేసింది. అయితే రద్దు ప్రతిపాదనపై హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్(డీహెచ్‌ఎస్) సీనియర్ యంత్రాంగం పరిశీలనలు చేసిందని.. తదుపరి సమీక్ష కోసం అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూస్‌సీఐఎస్)కు పంపినట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. అందువల్లే నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతోందని డీహెచ్‌ఎస్ ఫెడరల్ కోర్టుకు వెల్లడించింది.హెచ్4 వీసాదారుల పని అనుమతిని రద్దు చేస్తే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే. 2017 డిసెంబరు 25 నాటికి 1,26,853 మంది హెచ్4 వీసాదారులకు యూఎస్‌సీఐఎస్ పని అనుమతిని కల్పించింది. వీరిలో 93శాతం మంది భారత్‌కు చెందినవారే. ఇక ఐదు శాతం మంది చైనా దేశస్థులు ఉన్నారు. ఒకవేళ వీరికి పని అనుమతిని రద్దు చేస్తే హెచ్-1బీ వీసాదారులు ఒక్కరి వేతనంతోనే కుటంబాన్ని నడపాల్సి ఉంటుంది. అమెరికాలో అది సాధ్యం కాని పని అని కొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.