రాఫెల్ డీల్ వ్యవహారంలో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాఫెల్‌పై పదేపదే అబద్ధాలు చెబుతూ దేశాన్ని మోసం చేసేందుకు మోదీ ప్రయత్నించారంటూ విమర్శలు గుప్పించారు. రిలయన్స్ డిఫెన్స్ పేరును స్వయంగా మోదీ ప్రభుత్వమే సూచించిందని, దీంతో దసాల్ట్ సంస్థ అనిల్ అంబానీతో సంప్రదింపులు జరిపిందని, భారత్ ఎన్నిక చేసిన ప్రతినిధిని ఎంచుకోవడమే తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేకపోయిందని ఫ్రాన్స్‌తో భారత్ రాఫెల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలాండ్ వెల్లడించడం భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పారిస్ కేంద్రంగా నడుస్తున్న ఇన్వెస్టిగేటివ్ న్యూస్ జర్నల్ మీడియా పార్ట్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హోలాండ్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇద్దరు రక్షణ మంత్రులు మనోహర్ పారికర్, నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాఫెల్ స్కామ్‌పై పదేపదే అబద్ధాలు చెబుతూ వచ్చారని, వారు దేశాన్ని తప్పుదారి పట్టించడమే కాకుండా, కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశారని నిప్పులు చెరిగారు. ఇందుకు బాధ్యత వహంచి మోదీ తన పదవికి రాజీనామా చేయాలని ఓ ట్వీట్‌లో ఆయన డిమాండ్ చేశారు.