ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ఓ వైపు విశేష స్పందన వస్తుండగా, మరోవైపు పార్టీలో చేరికలతో పాటు రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జడ్పీ చైర్మన్, వైసీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు అప్పగించాల్సిన వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను మరొకరికి అందించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధినేత వైఖరి నచ్చని కారణంగా పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీకి రూ.50 కోట్లు కావాలని, అంత డబ్బు నువ్వు ఖర్చుపెట్టగలవా అని వైఎస్ జగన్ తనను ప్రశ్నించినట్లు బొమ్మిరెడ్డి వివరించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ, వైసీపీ నేత కొమ్మి లక్ష్మయ్య నాయుడిపై ఘన విజయం సాధించారు