టీడిపి అనధికార స్పోక్స్ మెన్ గా గుర్తింపు పొందిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు కు వైసిపి నుంచి మరో సవాల్ ఎదురైంది. ఇంతకుముందు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ తో అమరావతి బాండ్ల జారీపై చర్చకు సిద్ధం అన్న కుటుంబరావు అది తేలకుండానే మాజీ మంత్రి వైసిపి నేత పార్ధసారధి నుంచి చర్చకు రావాలంటూ ఆహ్వానం అందింది. బాండ్ల జారీలో రూపాయి అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేసి పోతా అంటూ టిడిపి పై విమర్శల వర్షం కురిపిస్తున్న అన్నిపార్టీలకు కుటుంబరావు సవాల్ చేశారు. ఈ సవాల్ ను ఉండవల్లి తొలుత స్వీకరించి ఆయనతో చర్చకు సిద్ధమన్నారు. చర్చ ఎలా జరగాలో కూడా నిర్దేశించారు. కానీ ఉండవల్లి ప్రతిపాదనలపై కుటుంబరావు సూటిగా సమాధానం ఇప్పటివరకు ఇవ్వలేదు. వారిద్దరి నడుమ చర్చ ఉంటుందో లేదో కూడా తేలలేదు.లాజికల్ గా మాట్లాడటంలో దిట్ట అయిన కుటుంబరావు దూకుడు కు చెక్ పెట్టాలని వైసిపి సైతం డిసైడ్ అయ్యింది. న్యాయవిద్య తో బాటు ఛార్టర్డ్ అకౌంటెంట్ కూడా అయిన కుటుంబరావు ఆర్ధిక విషయాలపై అనర్గళంగా మాట్లాడగలరు. ఇటీవల టివి షో లలో ఆయన తనదైన శైలిలో చంద్రబాబు సర్కార్ పనుల ను సమర్ధిస్తూ సమర్ధవంతమైన చర్చలు సాగిస్తున్నారు. ముఖ్యంగా బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు కు ప్రతి చోటా చెక్ పెట్టె ప్రయత్నాన్ని కుటుంబరావు తోనే చేయిస్తుంది టిడిపి.అదేవిధంగా వైసిపి పై కూడా ఆయన ఎటాక్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబరావు సంగతి ఇప్పటినుంచి చూడాలని వైసిపి డిసైడ్ అయ్యింది. ఆ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కుటుంబరావు ప్రకటనలు అవాస్తవమంటూ దాడి మొదలు పెట్టేశారు. అన్ని వైపుల నుంచి ఆయన చర్చకు రావాలనే వత్తిడి మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో కుటుంబరావు ఎలా వ్యవహరిస్తారు ? ఎవరో ఒకరితో బహిరంగ చర్చకు సిద్ధం అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.