ఏపీలో ఎన్నికల సమరం జోరందుకోనుంది. 2019 రణరంగానికి రంగం సిద్ధమౌతోంది. ఓ వైపు అధికార టీడీపీ పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతుంటే… విపక్ష వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రతో గత ఆరు నెలలగా ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ జనసేన ఇప్పటి వరకు జిల్లా కమిటీలు, బూత్ కమిటీలు లేకపోయినా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు కీలక నేతలు ఉత్సాహంతో కదన రంగంలోకి దుముకుతుండడం ఆశ్చర్యకర విషయమే. ఇప్పటి వరకు సంస్థాగతంగా ఎలాంటి బలం లేకపోయినా సామాజకవర్గ పరంగా…. పవన్ కళ్యాణ్ ఇమేజ్ పరంగా పలువురు కీలక నేతలు జనసేన నుంచి పోటీ చేసి తమ తలరాతలు పరిక్షించుకునేందుకు ఉత్సాహంతో ఉన్నారు.కీలకమైన కృష్ణా జిల్లాలో పలువురు నేతలు జనసేనలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇదే క్రమంలో కొందరు అప్పుడే తాము పోటీ చేసే సీట్లపై కన్నేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రసుత్తం ఉన్న సమీకరణల నేపథ్యంలో జనసేన, సీసీఐ, సీపీఎం కలిసి పయనిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలే కూటమి కట్టి పోటీ చెయ్యడం దాదాపు ఖరారే. ఇదే క్రమంలో విజయవాడ సెంట్రల్ సీటును సీపీఎం, వెస్ట్ సీటును సీపీఐ ఆశిస్తున్నాయి. సెంట్రల్లో 2009లో సీపీఎం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెన్నమనేని బాబురావే మరో సారి అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఇక వెస్ట్ నుంచి సీపీఐ తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేరు వినిపిస్తోంది.ఇదిలా ఉంటే ఇతర కీలక నియోజకవర్గాల్లో మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ రెండో కుమార్తె విజయవాడ లేదా మచిలీపట్నం పార్లమెంట్ సీట్లలో ఏదో ఒక సీటు ఇవ్వాలని అడుగుతున్నట్టు జనసేన వర్గాలు ద్వారా తెలుస్తోంది. జనసేన ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి తోట చంద్రశేఖర్ భార్య అవనిగడ్డ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆమె అవనిగడ్డ అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంట్ సీట్లలో ఏదో ఒకటి తనకి ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నోవా విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావు సైతం తనకు అవనిగడ్డ లేదా నూజివీడు నియోజకవర్గాల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ మనవడు రామ్‌చరణ్ సైతం అవనిగడ్డ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.విచిత్రం ఏంటంటే సింహాద్రి సత్యనారాయణ తనయుడు సింహాద్రి రమేష్ బాబు ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఇక జగ్గయ్యపేట సీటు నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ సమన్వయకర్త సామినేని ఉదయభాను మేనల్లుడు సైతం జనసేన సీటు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆయనకు సీటు ఇస్తే మేనమామ, అల్లుడి మధ్య ఆసక్తికర పోరు తప్పేలా లేదు. ఇదిలా ఉంటే వైసీపీలో ఇమడలేకపోతున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సైతం జనసేనలోకి జంప్ చేసి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒక సీపీఎంతో జనసేనకు పొత్తున్న నేపథ్యంలో రాధాకు సెంట్రల్ సీటు ఇస్తారా లేదా సీపీఎంకు మరో ఆప్షన్ ఇస్తారా ?అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే నగరంలోని విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తితో ఉన్నారు. గన్నవరం నుంచి కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ఓ ఎన్నారై సీటు ఆశిస్తున్నారు. ఇక జనసేన గుడివాడ, పెడన, కైకలూరు సీట్లను వ్యూహాత్మకంగా బీసీలకు ఇస్తే ఎలా ఉంటుందా ? అని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ సీటును కమ్మ వర్గానికి ఇవ్వాలన్న వ్యూహంలో ఉంది. మరో ఒకటి, రెండు నెలల్లో మరి కొంతమంది కీలక నేతల సైతం జనసేనలోకి జంప్ చేసి కీలక నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సీట్లు అడగాలని కోరుతున్నారు.